జాహ్నవి మృతి అత్యంత బాధాకరం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి
● బాధిత కుటుంబానికి పరామర్శ
పి.గన్నవరం: జి.పెదపూడి ప్రాథమిక పాఠశాలలో సిమ్మెంటుతో చేసిన జింక బొమ్మ మీద పడి రెండో తరగతి విద్యార్థిని దివి జాహ్నవి మృతి చెందడం అత్యంత బాధాకరమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, పి.గన్నవరం నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆ విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించి, వైఎస్సార్ సీపీ తరఫున రూ.25 వేల సాయం అందించారు. బాలిక తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, వైఎస్సార్ సీపీ జిల్లా వాణిజ్య విభాగం నాయకుడు మంతెన రవిరాజు, నియోజకవర్గ పరిశీలకుడు చింతలపాటి శ్రీనివాసరాజు, మండల అధ్యక్షులు యన్నాబత్తుల ఆనంద్, విత్తనాల ఇంద్రశేఖర్, సర్పంచ్‌లు దంగేటి అన్నవరం, కొంబత్తుల ఏసుబాబు, నాయకులు కర్రి నాగిరెడ్డి, కొపనాతి రోజావాణి, పెదపూడి సతీష్, కర్రి సుబ్రహ్మణ్యం, కోట విజయరాజు తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఉన్నారు.
కూటమి నాయకుల దుష్ఫ్రచారం
జి.పెదపూడి పాఠశాలలో జరిగిన దురదృష్టకరమైన సంఘటనపై కొందరు కూటమి నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని చిర్ల జగ్గిరెడ్డి, గన్నవరపు శ్రీనివాసరావు అన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన నాడు–నేడు కార్యక్రమంలో ఈ పాఠశాలకు మౌలిక సదుపాయాలు కల్పించారన్నారు. అప్పట్లో నాటి హెచ్‌ఎంకు గ్రామంలోని దాతలు అందించిన రూ.1.1 లక్షల సాయంతో పిల్లలు ఆడుకునేందుకు వీలుగా క్రీడా సామగ్రితో పాటు, సరస్వతి విగ్రహం, రెండు సిమ్మెంటు జింక బొమ్మలను ఏర్పాటు చేశారన్నారు. పునాది వేయకుండా జింక బొమ్మలను నేల మీదనే పెట్టడంతో ప్రమాదం జరిగిందన్నారు. అయితే నాడు – నేడు నిధులతో ఆ బొమ్మలు ఏర్పాటు చేయలేదన్నారు.


