స్వామిసేవకు ఒక్కటై.. | - | Sakshi
Sakshi News home page

స్వామిసేవకు ఒక్కటై..

Jan 25 2026 7:02 AM | Updated on Jan 25 2026 7:02 AM

స్వామ

స్వామిసేవకు ఒక్కటై..

అంతర్వేది కల్యాణంలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ప్రాధాన్యం

కల్యాణ కర్తలుగా రెండు జిల్లాల వాసులు

ఈ నెల 28వ తేదీన కళ్యాణం

దశాబ్దాలుగా కొనసాగుతున్న

ఆనవాయితీ

సాక్షి, అమలాపురం/సఖినేటిపల్లి: అఖండ గోదావరి సప్త నదీపాయలుగా వీడి ప్రవహించే పుణ్యభూమిని ఆనుకుని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఏర్పడ్డాయి. పేరుకు వేరైనా ఇక్కడ ఆచార వ్యవహారాలు, వేషభాషలు ఒక్కటే. పలు కార్యక్రమాలలో ఈ రెండు జిల్లాలకు భాగస్వామ్యం తప్పకుండా ఉంటుంది. అటువంటి వాటిలో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం ముఖ్యమైనది. ఈ ఘట్టంలో ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన పలు కుటుంబాలు కీలకంగా వ్యవహరిస్తాయి.

ఉమ్మడి తూర్పులో..

ఫ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో నరసింహస్వామివారి ఆలయం ఉంది. ఇక్కడే స్వామివారి కల్యాణాన్ని ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూంటారు. కల్యాణ ఘట్టంలో స్వామి, అమ్మవార్లకు అలంకరించే పట్టు వస్త్రాలను కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం నుంచి తీసుకు వస్తారు. ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచో కొనసాగుతోంది.

ఫ స్వామివారి కల్యాణం జరిగే కోనసీమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కల్యాణానికి ముందు స్వామి, అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలను చేసే అరుదైన అవకాశం సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం గ్రామానికి చెందిన బెల్లంకొండ, ఉండవిల్లి కుటుంబాలకు దక్కింది. అంతర్వేది ఉత్సవాల్లో రథసప్తమి రోజున నిర్వహించే ముద్రికాలంకరణలో స్వామికి పంచెను బెల్లంకొండవారు, అమ్మవారికి చీరను ఉండవిల్లి వారు ఇవ్వడం ఆనవాయితీ. అలాగే చోరసంవాదం ఘట్టంలో కూడా నిర్వహించే పూజా సామగ్రిని ఈ రెండు కుటుంబాల వారూ తీసుకువెళతారు.

ఫ స్వామివారి చక్రస్నానం పేరూరు వేద పండితుల ఆధ్వర్యంలో జరుగుతుంది. స్వామివారి చక్ర పెరుమాళ్లు 14వ శతాబ్దంలో సముద్రంలో పడిపోయింది. పేరూరుకు చెందిన నేమాని నరసింహ సోమనాథం అంతర్వేది సముద్రతీరంలో 89 రోజులు తపస్సు చేయగా చక్రం దొరికింది. స్వామివారి కల్యాణ సమయంలో అగ్రతాంబూలం ఇవ్వాలని పండితులు నాటి రాజును కోరారు. దీనితో వారు చక్రస్నానం పేరూరు వేద పండితుల చేతుల మీదుగా నిర్వహిస్తూండడం దశాబ్దాలుగా వస్తోంది.

ఫ శృంగవరప్పాడుకు చెందిన రావి, యనుముల కుటుంబాలకు చెందిన వారు రథోత్సవం రోజున స్వామివారి ఉత్సవ మూర్తులను పల్లకీలో ఊరేగింపుగా తీసుకువస్తారు. పల్లకీని ముందు భాగంలో రావి కుటుంబానికి చెందిన వారు, వెనుక భాగంలో యనుముల కుటుంబాల వారూ మోస్తూ స్వామివారి ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి రథం వరకు తీసుకువస్తారు.

కల్యాణ కర్తలుగా..

ఈ రెండు జిల్లాల వాసులు, కొన్ని కుటుంబాల వారు అంతర్వేది నరసింహస్వామి వారి కల్యాణంలో కర్తలుగా తమవంతు బాధ్యతలు నెరవేరుస్తున్నారు. అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని దశాబ్దాలుగా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఇటు తూర్పు, అటు పశ్చిమ ఒక్కటై, అంతర్వేది దేవదేవుని కల్యాణం తంతును విజయవంతంగా జరుపుతున్నాయి. కాగా.. స్వామివారి కల్యాణోత్సవం ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి జరుగుతున్న విషయం తెలిసిందే.

పశ్చిమ గోదావరి జిల్లా నుంచి..

ఫ కల్యాణ ఘట్టంలో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన రాజ కుటుంబాలు కీలక భూమిక పోషిస్తాయి. మొగల్తూరు రాజవంశానికి చెందిన పెళ్లి కుమారుడు లక్ష్మీ నరసింహస్వామి తరఫున నిలబడి కల్యాణంలో పాల్గొంటారు. ప్రస్తుత వారసుడు రాజా కలిదిండి కుమార రామగోపాల రాజా బహుదూర్‌ చైర్మన్‌, ఫౌండర్‌ ఫ్యామిలీ మెంబరుగా కల్యాణంతో స్వామివారి తరఫున నిలబడతారు. వీరి కుటుంబం ఆలయానికి భూములు, అభరణాలు అందించినట్టు శాసనాలలో ఉన్నాయి.

ఫ పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పొలమూరుకు చెందిన కలిదిండి రాజయమ్మ అంతర్వేదిలో వందేళ్ల క్రితం స్థానికంగా సత్రం నిర్మించారు. దీని నిర్వహణ కోసం దానం చేసిన భూముల్లో పండే ధాన్యాన్ని బియ్యంగా మార్చి వాటిని తలంబ్రాలుగా తయారు చేసి అందించడం అనవాయితీగా వస్తోంది. రాజయమ్మ కుటుంబ సభ్యుడైన కలిదిండి సుబ్బారాజు ఆధ్వర్యంలో ప్రస్తుతం తలంబ్రాలు తీసుకువస్తున్నారు.

స్వామిసేవకు ఒక్కటై.. 1
1/5

స్వామిసేవకు ఒక్కటై..

స్వామిసేవకు ఒక్కటై.. 2
2/5

స్వామిసేవకు ఒక్కటై..

స్వామిసేవకు ఒక్కటై.. 3
3/5

స్వామిసేవకు ఒక్కటై..

స్వామిసేవకు ఒక్కటై.. 4
4/5

స్వామిసేవకు ఒక్కటై..

స్వామిసేవకు ఒక్కటై.. 5
5/5

స్వామిసేవకు ఒక్కటై..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement