రోజుకు ఏడు గంటలే పనిచేస్తాం
ఫ సచివాలయం విధులే నిర్వహిస్తాం
ఫ వీఆర్వోల జిల్లా సంఘం నిర్ణయం
అమలాపురం రూరల్: సమయంతో నిమిత్తం లేకుండా రెవెన్యూ శాఖలో అనేక పనులు నిర్వహిస్తున్న వీఆర్‌వోలకు సచివాలయాల అదనపు విధులు గోరుచుట్టుపై రోకలిపోటులా తయారయ్యాయని ఆ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి, జిల్లా గౌరవ అధ్యక్షుడు మద్దాల బాపూజీ ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరెట్‌లో జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కొప్పిశెట్టి గణేష్ అధ్యక్షతన శనివారం సంఘం జిల్లా సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన బాపూజీ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు ఒకే పని విధానం ఉందని, వీఆర్‌వోలకు పోలీస్, న్యాయస్థానం తదితర 64 రకాల విధులతో పాటు వ్యవసాయశాఖ, సివిల్ సప్లై, తదితర ఇతర శాఖలకు సహాయం చేయాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితులలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సచివాలయాల ద్వారా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ రెవెన్యూ పనులే చేస్తామని, సచివాలయాల విధులు నిర్వహించలేమని తెలిపారు. రామచంద్రపురం మండలంలో వీఆర్వోలు వర్కుటురూల్ పాటిస్తామని, ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితుల్లో తప్ప సెలవు దినాలలో ప్రభుత్వ విధులు నిర్వహించలేమని తెలిపారు. ఈ సమస్యలపై రామచంద్రపురం తహసీల్దార్ బండి మృత్యుంజయరావుకు మండల వీఆర్‌ఓ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సాధనాలు ఎల్లేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి మల్లేష్, జిల్లా ఉపాధ్యక్షుడు కేవీవీ సత్యనారాయణ, ఎస్.రాజేష్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.శివరాం పాల్గొన్నారు.


