వాహన విహారం.. ఇదీ పరమార్థం
● నేటి నుంచి
అంతర్వేదిలో రోజుకో వాహన సేవ
● అలరించనున్న స్వామివారి ఊరేగింపులు
సఖినేటిపల్లి: అంతర్వేది ఆధ్యాత్మికతతో అలరారుతోంది.. లక్ష్మీనృసింహ స్వామివారు కొలువైన దేవస్థానం కల్యాణోత్సవాలకు ముస్తాబైంది.. ఆదివారం నుంచి స్వామివారి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది.. వేడుకలు జరిగే ప్రతి రోజూ స్వామివారు రోజుకో వాహనంపై ఊరేగి, దాని పరమార్థం తెలిపే ఘట్టానికి వేళయ్యింది.. కల్యాణోత్సవాల్లో భాగంగా స్వామివారికి మాఢ వీధుల్లో వివిధ వాహనాలపై గ్రామోత్సవాలను నిర్వహిస్తుంటారు. 14 రకాల వాహనాలపై స్వామివారిని ఊరేగించడం ద్వారా ఆ వాహన సేవ పరమార్థాన్ని చాటుతున్నారు. ఏటా ఈ గ్రామోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ తెలిపారు. ప్రతి వాహనానికి ఓ పరమార్థం ఉందని పురాణాల ద్వారా అవగతమవుతోందని ఆయన వివరించారు. క్షేత్రంలో ఆదివారం నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకూ నిర్వహించనున్న వాహన సేవలు, వాటి విశిష్టతలు తెలుసుకుందాం రండి..
తొలి రోజు..
● సూర్య వాహనం: రథసప్తమి సందర్భంగా ఆదివారం సాయంత్రం స్వామివారు సూర్య వాహనంపై ఊరేగుతారు. భక్తులకు కనువిందు చేస్తారు. అజ్ఞానాన్ని పారద్రోలి, జ్ఞానమనే వెలుగును నింపడమే ఈ వాహనోత్సవ ఉద్దేశం.
● చంద్రప్రభ వాహనం: ఆదివారం రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. నిర్మలమైన మనసును, మనోవికాసాన్ని ఇవ్వడమే ఈ వాహనోత్సవ పరమార్థం.
రెండో రోజు..
● హంసవాహనం: సోమవారం సాయంత్రం లక్ష్మీ నరసింహ స్వామివారు హంసవాహనంపై ఆశీనులై ముందుకు సాగుతారు. మనిషిలోని జ్ఞాన అజ్ఞాలను వేరు చేసి, జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చాటేందుకే ఈ వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు.
● శేషవాహనం: రాత్రి ఆదిశేష వాహనంపై స్వామివా రు ఊరేగుతారు. శేషుడు వాక్పటిమ కలిగినవాడు. సర్వ వాక్కులకు అధినేతైన వాక్ పరబ్రహ్మను తానేనని భక్తులకు తెలియజెప్పేందుకే స్వామి ఆదిశేషుడిపై ఆశీనులై ముందుకు సాగుతారు.
మిగతా రోజుల్లో ఇలా..
● 27న హనుమద్వాహనంపై స్వామివారు ఊరేగుతారు. భక్తులు కూడా హనుమంతుని వలె స్వామిని తలుచుకుని పనులు నిర్విఘ్నంగా పూర్తి చేయవచ్చని చాటి చెప్పడమే ఈ వాహనం పరమార్థం. రాత్రి సింహవాహనంపై ఆశీనులు అవుతారు. మానవుడు, మాధవుడు కలసిన స్వరూపమే లక్ష్మీనృసింహస్వామి. ఆ మాధవ స్వరూపం, సింహం తానేనని స్వామి ఈ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.
● 28న పంచముఖ ఆంజనేయస్వామి వాహనంపై ఊరేగుతారు. బుద్ధి, బలం, కీర్తి, ధైర్యం, నిర్భయత్వం అనే గుణాలను భక్తులకు అందించడమే ఈ వాహన సేవ పరమార్థం. రాత్రి కంచు గరుడ వాహనంపై గ్రామోత్సవం ఉంటుంది. కామ, క్రోథ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జయించే శక్తిని భక్తులకు అనుగ్రహించేందుకు స్వామి ఈ వాహనంపై వెళతారు. రాత్రి 1–56 గంటలకు స్వామివారి తిరు కల్యాణం జరుగుతుంది.
● 30న గజ వాహనంపై స్వామివారికి వాహనోత్సవం ఉంటుంది. గజం బుద్ధికి సంకేతం. భక్తులు బాగా ఆలోచించి, భక్తి, జ్ఞాన, వైరాగ్యాల వైపు నడిచేందుకు స్వామివారు ఈ వాహనంపై ఊరేగుతారు. రాత్రి పొన్న వాహనంపై ఆశీనులు అవుతారు. సర్వస్వం నీవే అన్న గోపికల ఆత్మనివేదనను స్వీకరించినట్టుగా భక్తుల ఆత్మ నివేదనను స్వీకరించేందుకే ఈ వాహనంపై స్వామి ఊరేగుతారు.
● 31న రాజాధిరాజ వాహనంపై వాహన సేవ అందుకుంటారు. రాజులకే రాజైన లక్ష్మీనరసింహస్వామి భక్తుల కోర్కెలు తీర్చడానికి ఈ వాహనాన్ని అధిరోహించి గ్రామోత్సవానికి వెళతారు. రాత్రి అశ్వవాహనంపై ఆశీనులు అవుతారు. మనిషిలో ఉండే జ్ఞానం అశ్వం మాదిరిగా చురుకుగా ఉండాలని సూచించేందుకు స్వామి ఉత్సవాల్లో ఈ వాహనంపై దర్శనమిస్తారు.
● ఫిబ్రవరి 1న గరుడ పుష్పక వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. నిత్యం తనను సేవించే గరుడ వాహనంపై అధిరోహించి స్వామి గ్రామోత్సవానికి తరలివెళ్తారు.
● ఫిబ్రవరి 2న పుష్పక వాహనంపై స్వామివారికి వాహనోత్సవం ఉంటోంది. తన హృదయమనే పుష్పకంలో ఎంతమంది భక్తులు వచ్చినా చోటు కల్పిస్తానని చాటేందుకు స్వామి పుష్పక వాహనంపై ఊరేగుతారు. సాయంత్రం నుంచి అంతర్వేది చెరువులో తెప్పోత్సవం జరుగుతోంది.
ఉత్సవాల షెడ్యూల్ ఇలా..
అంతర్వేది లక్ష్మీనృసింహుని క్షేత్రంలో ఆదివారం నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకూ నిర్వహించనున్న స్వామివారి వార్షిక దివ్య తిరు కల్యాణ మహోత్సవాల షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించారు. 25న రథసప్తమి సందర్భంగా వాహన సేవలతో పాటు ముద్రికాలంకరణ (స్వామివారిని పెండ్లి కుమారుని, అమ్మవారిని పెండ్లి కుమార్తె చేయుట). 26న ఽసాయంత్రం ధూపసేవ, ధ్వజారోహణ ఘట్టం, 29న స్వామివారి రథోత్సవం, 30న రాత్రి అన్నపర్వత మహానివేదన, 31న సాయంత్రం సదస్యం, అనంతరం 16 స్తంభాల మంటపం వద్ద చోర సంవాదం, ఫిబ్రవరి 1న స్వామివారికి చక్రస్నానం, 2న కోనేరులో హంస వాహనంపై స్వామి, అమ్మవార్ల తెప్పోత్సవం జరుగుతాయి.
వాహన విహారం.. ఇదీ పరమార్థం
వాహన విహారం.. ఇదీ పరమార్థం
వాహన విహారం.. ఇదీ పరమార్థం


