బ్లో అవుట్ బాధితులకు రూ.10 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా
అమలాపురం రూరల్: మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఈ నెల 5న సంభవించిన బ్లోఅవుట్ ఘటనలో బాధితులైన 6300 కుటుంబాలకు రూ.10 చొప్పున ఓఎన్జీసీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. ఆయన శనివారం కలెక్టరేట్‌లో విలేకరులకు ఈ విషయం వెల్లడించారు. బ్లోఅవుట్ ఘటనలో ఇరుసుమండ, గుబ్బలపాలెం లక్కవరం, చింతపల్లి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. దీంతో ఆయా గ్రామాల్లోని 6,300 కుటుంబాల బ్యాంకు ఖాతా ల వివరాలను ఓఎన్జీసీ ప్రతినిధులు సేకరించి.. ఫిబ్రవరి మొదటి వారంలో ఎక్స్‌గ్రేషియా వారి ఖాతాల్లో జమ చేస్తారన్నారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ రూ.ఐదు లక్షల వైద్య బీమా, లక్కవరం గ్రామంలో 2.57 ఎకరాల విస్తీర్ణంలో వంద పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలన్న అభ్యర్థనకు ఓఎన్జీసీ అధికారులు సానుకూలంగా స్పందించారన్నారు.
27 నుంచి చించినాడ బ్రిడ్జిపై
బస్సుల రాకపోకలు
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దివ్య కల్యాణ మహోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకూ చించినాడ బ్రిడ్జిపై బస్సుల రాకపోకలను పునరుద్ధరించాలని అధికారులను కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌లో ఆర్టీసీ రహదారులు, భవనాల శాఖ, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అంతర్వేదికి రాష్ట్రం నలుమూలల నుంచీ భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, వారి సౌకర్యార్థం మరమ్మతుల్లో ఉన్న చించినాడ బ్రిడ్జిపై ఐదు రోజుల పాటు తాత్కాలికంగా బస్సుల రాకపోకలకు (సుమారు 16 టన్నుల బరువు) అనుమతించాలన్నారు. గోదావరిపై భద్రత దృష్ట్యా పంట్లపై ప్రయాణాలను నిరోధించాలన్నారు. చించినాడ వంతెనపై మార్కింగ్ ఇచ్చి, దానిలోనే బస్సులు తిరిగేలా మానిటరింగ్ చేయాలన్నారు.
నేడు విద్యుత్ బిల్లులు చెల్లించొచ్చు
అమలాపురం రూరల్: జిల్లాలో అన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల్లో ఆదివారం (ఈ నెల 25) విద్యుత్ బిల్లులు యథావిధిగా చెల్లించవచ్చని ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ ఎస్.రాజేశ్వరి తెలిపారు. వీటితో పాటు సెక్షన్ ఆఫీస్ కౌంటర్లు, ఏటీపీ కేంద్రాలు కూడా పనిచేస్తాయన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, బిల్లులను సకాలంలో చెల్లించాలని కోరారు.
జాతీయ స్థాయి బేస్‌బాల్ పోటీలకు అలేఖ్య
కాజులూరు: జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలకు కాజులూరు మండలం గొల్లపాలెం జెడ్పీ హైస్కూల్‌కు చెందిన వింత అలేఖ్య ఎంపికై ంది. ఈ మేరకు శనివారం పాఠశాలలో స్కూల్ హెచ్‌ఎం ఎస్‌ఎస్‌బీ సుశీలమణి ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. పీడీ జి.సునీల్‌కుమార్ మాట్లాడుతూ కడప జిల్లా రైల్వేకోడూరులో నవంబర్ 15 నుంచి 17 వరకూ ఎస్‌జీఎఫ్ అండర్ – 19 రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ పోటీలు జరిగాయన్నారు. వాటిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జట్టులోని తమ తొమ్మిదో తరగతి విద్యార్థిని వింత అలేఖ్య చక్కని ప్రతిభ కనపరిచి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. ఢిల్లీలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకూ జరిగే జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర టీమ్ తరఫున పోటీపడుతుందన్నారు.
బ్లో అవుట్ బాధితులకు రూ.10 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా


