అన్నదమ్ముల బైక్‌లు ఢీ: తమ్ముడి మృతి 

Young Man Deceased In Road Accident In Kalasapadu Of Kadapa Distric - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ (కలసపాడు): విధి విచిత్రమంటే ఇదే. అనుకోకుండా సొంత అన్నదమ్ముల బైక్‌లు ఢీ కొనగా తమ్ముడు దుర్మరణం పాలైన ఘటన కలసపాడు మండల కేంద్రం సమీపంలో బుధవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు.. కలసపాడులోని మస్తాన్, షేక్‌ పీరాంబీ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్నకుమారుడు షేక్‌ షఫీ (27) విద్యాశాఖ కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్నాడు. సిద్దుమూర్తిపల్లె సమీపంలో ఉన్న పాలకేంద్రంలో ఇతడి అన్న షేక్‌ షరీఫ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. విధులు ముగించుకుని ఇతను కలసపాడులోని ఇంటికి బయలుదేరాడు.

షఫీ వ్యక్తిగత పని నిమిత్తం చెన్నారెడ్డిపల్లెకు బయలుదేరాడు. ఎదురెదురుగా వస్తున్న వీరి బైక్‌లు పోరుమామిళ్ల రోడ్డులోని కోతి సమాధి సమీపంలోకి రాగానే ఢీకొన్నాయి. ప్రమాదంలో షఫీ అక్కడిక్కడే మృతి చెందగా, షరీఫ్‌కు స్వల్పగాయాలయ్యాయి. మృతుడికి ఐదేళ్ల కిందట కలసపాడుకు చెందిన షేక్‌ షాహిన్‌తో వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమారుడు. ఒక ఏడాది పాప ఉన్నారు. బక్రిద్‌ పండుగ రోజు చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో కుటుంబసభ్యులందరూ విషాదంలో మునిగిపోయారు. ఎస్‌ఐ రామాంజనేయులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.      

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top