ప్రేమ వివాహం.. భారీగా కట్నకానుకలు అయినా..

Woman Commits Suicide Over Dowry Harassment In Warangal - Sakshi

సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్‌(వరంగల్‌): అదనపు కట్నం కోసం భర్త, అత్తమామాల వేధింపులు తాళలేక వివాహిత ముప్పిడి లావణ్య(20) బలైన సంఘటన మండలంలోని కోమటిగూడెంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. కోమటిగూడెం గ్రామానికి చెందిన పర్శ బాలరాజు, యాకమ్మ దంపతుల కుమార్తె అయిన లావణ్య ఇంటర్‌ చదివి ఇంటి వద్ద ఉండేది.

వారి ఇంటి ఎదురుగా ముప్పిడి కొండయ్య, మల్లమ్మ దంపతులు ఉండేవారు. వారి కుమారుడు ముప్పిడి నరేష్‌ లావణ్యతో ప్రేమలో పడ్డాడు. విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలియగా ఇద్దరూ ఒకే కులానికి(ముదిరాజ్‌) చెందిన వారు కావడంతో 11 నెలల క్రితం వివాహం చేశారు. వివాహ సమయంలో కట్నంగా అర ఎకరం చెలుక, ఐదు తులాల బంగారం, పెళ్లి ఖర్చులకు రూ.లక్ష నగదు ఇచ్చారు.

అయితే మొదట్లో బాగానే ఉన్నప్పటికీ ఐదారు నెలలుగా అదనపు కట్నం కోసం లావణ్యను భర్త నరేష్‌తో పాటు అత్తమామలు వేధిస్తున్నారు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా నరేష్‌కు పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. భార్యను బాగానే చూసుకుంటానని పెద్దమనుషులు, పోలీసుల సమక్షంలో చెప్పిన నరేష్‌ తిరిగి వేధింపులను ప్రారంభించాడు.

దాంతో కొద్దిరోజులుగా ఆమె తల్లిగారి ఇంటి వద్దనే ఉంటుంది. అయితే రోజూ మాదిరిగానే వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చిన ఆమె తల్లిదండ్రులు లావణ్య ఇంట్లో ఉరి వేసి ఉండటం గమనించి రోధిస్తూ కిందకుదించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెంది ఉంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి తమ కుమార్తెను ఆమె భర్త నరేష్‌ ఉరివేసి చంపాడని ఆరోపిస్తూ అతడి ఇంటి ఎదుట మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు.

అయితే అప్పటికే నరేష్‌ ఇంట్లో ఎవరూ లేకుండా పరారు కావడంతో రాత్రి వరకూ మృతదేహంతో ఆందోళన చేశారు. మృతదేహంపై పడి తల్లి, బంధువులు పెద్ద ఎత్తున రోదించారు. విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాస్‌రెడ్డి పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పి చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అనంతరం మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆమెది ఆత్మహత్యనా, హత్య అనే విషయమై గ్రామంలో చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో  తేలనున్నాయి. 

కమలాపూర్‌లో మరొకరు..
కమలాపూర్‌: వరకట్న వేధింపులు తాళలేక కమలాపూర్‌ మండలకేంద్రానికి చెందిన పబ్బు హారిక (27) అనే వివాహిత గురువారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.కాజీపేట ఏసీపీ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపూర్‌కు చెందిన పబ్బు పాపయ్య– సుభద్రల కుమారుడు కిరణ్, జక్కు సాంబమూర్తి– కళమ్మల కూతురు హారిక ప్రేమించుకోగా సుమారు ఐదేళ్ల క్రితం ఇరు కుటుంబాలు వారి ప్రేమను అంగీకరించి వివాహం జరిపించారు.

వివాహ సమయంలో రూ.లక్ష నగదు, 6 తులాల బంగారం, కల్లు చీరిక రాసిచ్చి ఇతర లాంఛనాలు ముట్టజెప్పారు. ప్రస్తుతం వీరికి మూడున్నర ఏళ్ల కుమారుడు ఉన్నారు. పెళ్‌లైన కొద్ది కాలం నుంచి అదనపు కట్నం తేవాలంటూ హారికను ఆమె భర్త కిరణ్, అత్త సుభద్ర శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో మూడు విడతలుగా రూ.లక్ష చొప్పున మొత్తం రూ.3 లక్షలు అదనంగా ఇచ్చినట్లు తెలిపారు.

ఈ నెల 16న కళమ్మతో పాటు ఆమె ఇద్దరు కూతుర్లు సంధ్య, హారికలు మొట్టుపల్లిలో జరిగిన బంధువుల వివాహానికి వెళ్లారు. ఈ నెల 18న కిరణ్‌ అక్కడికి వెళ్లి హారికతో గొడవపడి ఆమెను తీసుకుని కమలాపూర్‌కు వచ్చాడు.

అదే రోజు రాత్రి హారిక ఉరి వేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. తన కూతురు హారిక మృతి పట్ల భర్త కిరణ్, అత్త సుభద్రలపై అనుమానాలు ఉన్నాయని మృతురాలి తల్లి కళమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top