అక్రమ సంబంధాలంటే.. హత్యలు చేసే మగాళ్లను చాలాకాలం నుంచి చూస్తున్నాం కానీ.. ప్రియుడి కోసం భర్తను హత్య చేసే స్త్రీల గురించి అరుదుగానే విని ఉంటాం. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలోని సుభాష్ నగర్ ప్రాంతంలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ప్రియుడి మాయలో పడ్డ ఓ మహిళ భర్త అడ్డు తొలగించుకునేందుకు నిద్రమాత్రలను ప్రయోగించింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో తానొకటి తలిస్తే.. విధి ఇంకోటి తలచిందన్నట్లు ఆమె ప్రయత్నం బెడిసికొట్టింది. వివరాలు ఇలా ఉన్నాయి...
ఆరోగ్యశాఖలో పని చేసి రిటైర్ అయిన వైద్యుడు అతడు. కూతురు పెళ్లయిపోవడంతో ఇంట్లో భార్య, భర్తలు మాత్రమే ఉంటున్నారు. సౌరభ్ సక్సేనా అనే ఎలక్ట్రిషియన్ అప్పుడప్పుడూ ఇంటికి వచ్చిపోతూండే వాడు. ఈ క్రమంలోనే అతడికి, వైద్యుడి భార్యకు సాన్నిహిత్యం పెరిగింది. ఈ విషయం తెలిసిన భర్త.. తగదని భార్యను వారించాడు. ఆమె వినలేదు సరికదా.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసే ప్లాన్ చేసింది. నిద్రమాత్రలు కలిపిన పాలను భర్తకు ఇచ్చింది. పాలు తాగిన ఆ వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకోగానే.. ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది.
సౌరభ సక్సేనా, ఆ మహిళ ఇద్దరూ ముందుగా సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేశారని, ఆ తరువాత సృ‍్పహ తప్పి పడి ఉన్న భర్తను ఇంకో గదిలోకి లాక్కెళ్లారు. మెడకు ఉరి బిగించి.. ఒక  సుత్తితో అతడిపై దాడి చేశారు. చెక్‌బుక్, బ్యాంకు పాస్‌బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. ఆస్తి పత్రాలపై బలవంతంగా సంతకాలు పెట్టించే ప్రయత్నమూ చేశారు కానీ.. కథలో ట్విస్ట్ ఇక్కడే చోటు చేసుకుంది. సౌరభ్‌కు తాగుడు అలవాటు ఎక్కువ. ఈ తతంగమంతా నడుస్తున్న సమయంలో మనోడికి మందు తాగాలనిపించింది. ప్రియురాలు వారించినా వినలేదు. మందు కావాల్సిందేనని పట్టుబట్టాడు. చేసేదేమీ లేక ఆమె భర్త తాగే ఖరీదైన మద్యం తెచ్చి ఇచ్చింది. ఫ్రీగా వచ్చిందనుకున్నాడో ఏమో కానీ.. ఫుల్లుగా తాగేశాడు. మత్తు ఎక్కువై అక్కడే పడిపోయాడు. ఈ లోపు నిద్ర మాత్రల మత్తులోనే ఉన్న వైద్యుడు ఎలాగోలా కష్టపడి పక్కింటి తలుపు తట్టగలిగాడు. జరిగిందంతా వారికి వివరించగలిగాడు. పక్కింటోళ్ల ఫిర్యాదుతో పోలీసులు ఇంటికి వచ్చేసరికి సౌరభ సక్సేనా ఎలాగోలా పారిపోయాడు. వైద్యుడి భార్య, సౌరభ్ సక్సేనాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
