వీఆర్వోపై పెట్రోలుతో దాడి..! 

Two People Petrol Attack On VRO In Guntur - Sakshi

కులం పేరుతో దాడి చేశారన్న వీఆర్వో 

లంచం తీసుకుని పనిచేయలేదనే మనస్తాపంతో..  

పెట్రోలు పోసుకోబోయామంటూ ఆ ఇద్దరు ఫిర్యాదు 

అచ్చంపేట (పెదకూరపాడు): మండలంలోని గ్రంధశిరి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తనపై పెట్రోలుతో దాడి చేశారంటూ ఆ గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) కోటా మోహనరావు శుక్రవారం అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి కథనం ప్రకారం.. తాను తహసీల్దారు కార్యాలయం పక్కనే ఉన్న గ్రామ సేవకుల గదిలో కూర్చుని రికార్డులు రాసుకుంటుండగా రావెళ్ల లవణ్‌కుమార్, పరుచూరి రామకృష్ణ వచ్చి వారి గ్రామానికి చెందిన అర్జీలు మొత్తం తమకు ఇవ్వమని, తహసీల్దార్‌తో తామే మాట్లాడుకుంటామని అడిగారని, అందుకు తాను ఒప్పుకోకపోవడంతో కులంపేరుతో దూషించి, రికార్డులపైన, తనపైన పెట్రోలు పోసి అగ్గిపుల్ల గీసే ప్రయత్నం చేశారన్నారు. తన వద్ద పనిచేసే నాగేశ్వరరావు వారిని అడ్డుకోవడంతో తాను ప్రమాదం నుంచి బయట పడ్డానని వీఆర్వో మోహనరావు ఫిర్యాదులో పేర్కొన్నారు.   

కాదు, మేమే పోసుకోబోయాం..  
మా భూమిని ఆన్‌లైన్‌లో ఎక్కించటానికి వీఆర్వో లంచం తీసుకుని కూడా పనిచేయకుండా తిప్పుకుంటున్నాడని, దీంతో తాము మనస్తాపంతో పెట్రోలు పోసుకునేందుకు ప్రయత్నించగా, పక్కనున్న వారు అడ్డుకున్నారని పరుచూరి రామకృష్ణ, రావెళ్ల లవణ్‌కుమార్‌ శుక్రవారం అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమకున్న ఒకటిన్నర ఎకరాల భూమిని ఆన్‌లైన్‌లో ఎక్కించి, అడంగల్‌ కాపీలు పొందేందుకు వీఆర్వో మోహనరావు లంచం తీసుకుని కూడా పని చేయలేదని, తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని వారు వాపోయారు. వీఆర్వోపై తాము పెట్రోలు పోయడం అవాస్తవమన్నారు. ఇరు వర్గాల నుంచి స్టేట్‌మెంట్లు నమోదు చేసుకుని, కేసు విచారిస్తున్నట్లు ఎస్‌ఐ కె.ఆనంద్‌ తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top