TSRTC: జాతీయ రహదారిపై బస్సుబోల్తా..

TSRTC Bus Accident Tragedy In Mahabubnagar - Sakshi

సాక్షి, అలంపూర్‌(మహబూబ్‌నగర్‌): జాతీయ రహదారిపై ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైందనే సమాచారంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమైంది. జిల్లాలో గతంలో జరిగిన ఆర్టీసీ ప్రమాదాలు గుర్తుకు వచ్చి భయాందోళన చెందారు. పెద్ద ప్రమాదమే అయినప్పటికీ అందులోని ప్రయాణికులు స్వల్పగాయాలతో బయపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదాల బారినపడిన వారిని కర్నూలుకు తరలించి చికిత్స అందించారు.

ఈ ఘటన ఉండవెల్లి మండలంలోని కంచుపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న ఘర్‌ దాబా వద్ద సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించి ఎస్‌ఐ జగన్‌మోహన్‌ కథనం ప్రకారం.. కాచిగూడకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం రాత్రి 11 గంటల సమయంలో 36 మంది ప్రయాణికులతో కర్నూలు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో జాతీయ రహదారిపై ఘర్‌ దాబాకు అతి సమీపంలో డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తోపాటు మరో 4 ప్రయాణికులకు గాయాలయ్యాయి.

ఇందులో డ్రైవర్‌ శ్యాం తీవ్రంగా గాయపడ్డాడు. రాముడు అనే ప్రయాణికుడికి ఎడమ చేయి విరిగిపోగా.. రవికుమార్, నర్సింహలతోపాటు మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మానవపాడు 108 సిబ్బంది క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు డివైడర్‌ను ఢీకొని బోల్తాపడగా వెనకాల వస్తున్న కారు డివైడర్‌ రాడ్‌ తగిలింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతినగా అందులో ఉన్న దంపతులకు ఎలాంటి గాయాలు కాలేదు. 

నిలిచిన రాకపోకలు.. 
జాతీయ రహదారిపై బస్సు బోల్తాపడంతో కర్నూలు– హైదరాబాద్‌ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఎస్‌ఐ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. అనంతరం రోడ్డుపై ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడకుండా ఒకేమార్గంలో రెండు వైపుల వాహనాలు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకున్నారు. తర్వాత రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సును పోలీసులు క్రేన్‌ సాయంతో పక్కకు తొలగించారు. ప్రమాద స్థలాన్ని గద్వాల డిపో సీఐ దేవేందర్‌గౌడ్‌ పరిశీలించారు. డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top