భూతగాదాలకు దంపతులు బలి

Thugs Who Chopped Wife And Husband With An Axe In Peddapalli District - Sakshi

పెద్దనాన్న, పెద్దమ్మలను గొడ్డలితో నరికిన యువకుడు 

పెద్దపల్లి జిల్లాలో ఘటన 

పాలకుర్తి(రామగుండం): భూతగాదాలు దంపతుల హత్యకు దారితీశాయి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రామారావుపల్లికి చెందిన మంచినీళ్ల వెంకటి (55), తమ్ముడు రాజయ్య మధ్య కొన్నేళ్లుగా భూవివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో రాజయ్య కుమారుడు రవితేజ గురువారం పొలం వద్దకు వెళ్లి బావి నీటి విషయమై వెంకటితో ఘర్షణ పడ్డాడు. గొడ్డలితో దాడి చేయడంతో ప్రాణాలొదిలిన వెంకటిని లాక్కెళ్లి సమీపంలోని పొదల్లో పడేశాడు.

పొలంలో కలుపుతీస్తున్న వెంకటి భార్య కనకమ్మ గమనించి పరుగెత్తుకుంటూ వస్తుండగా ఆమెపైనా గొడ్డలితో దాడి చేశాడు. దీంతో కనకమ్మ అక్కడికక్కడే కుప్పకూలింది. అనంతరం నిందితుడు బసంత్‌నగర్‌ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు. మృతిచెందిన వెంకటి దంపతులకు కూతురు రాధ, కుమారుడు రమేష్‌ ఉన్నారు. రాధకు వివాహం కాగా, రమేష్‌ కరీంనగర్‌లోచదువుకుంటున్నాడు. వెంకటి గతంలో గ్రామ ఎంపీటీసీగా పనిచేశారు. 

పంపకాల్లో తేడాలతోనే... 
వెంకటి, రాజయ్యల వారసత్వ భూమిలో ఇదివరకు సబ్సిడీ బావిని తవ్వారు. భూపంపకాల అనంతరం ఆ బావిలో రాజయ్యకు వాటా లేదని వెంకటి అనడంతో వివాదం మొదలైంది. ఆరేళ్లుగా ఇరువురి మధ్య వ్యవసాయబావి, భూముల విషయమై తరచూ గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. వివాదం పోలీసుస్టేషన్‌ వరకు వెళ్లినా అది సివిల్‌ సమస్య కావడంలో పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు.

ఈ క్రమంలో ఇరువురి మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే రవితేజ పథకం ప్రకారం పెద్ద నాన్న, పెద్దమ్మను గొడ్డలితో నరికి చంపాడని గ్రామస్థులు భావిస్తున్నారు. కాగా, ఐదేళ్ల క్రితం ఆస్తి తగాదాల నేపథ్యంలో గ్రామానికి చెందిన కొండ గట్టయ్య దంపతులను వారి కుమారులు కల్లుగీత కత్తితో గొంతులు కోసి హత్య చేశారు. ప్రస్తుతం అదేరీతిన భూవివాదాల నేపథ్యంలో సొంత పెద్దమ్మ, పెద్దనాన్నను కుమారుడి వరసైన యువకుడు గొడ్డలితో హత్య చేసి చంపాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top