పెళ్లై 2 నెలలు.. చెల్లెలిని స్కూల్‌ నుంచి తీసుకొస్తానని..

Three Persons Missing In Different Incidents At Hyderabad - Sakshi

ఆదివారం భారీగా అదృశ్యం కేసులు నమోదు అయ్యాయి. చెల్లెల్ని స్కూల్‌ నుంచి తీసుకువస్తానని చెప్పిన వివాహిత..  ఇంటి నుంచి బయటకు వెళ్లిన గృహిణి.. వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్లిన వ్యక్తి.. అదృశ్యమయ్యారు. పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

కుత్బుల్లాపూర్‌: ఇంటి నుంచి బయటకు వెళ్లిన వివాహిత అదృశ్యమైన ఘటన పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌ పరిధిలో చోటు  చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గుండ్లపోచంపల్లికి చెందిన దీపామాలా (20) కు రెండు నెలల క్రితం శత్రుధన్‌తో వివాహమైంది. ఈ నెల 3వ తేదీ సాయంత్రం తన చెల్లెలిని స్కూల్‌ నుంచి తీసుకువస్తానని చెప్పి వెళ్లిన దీపామాలా తిరిగి ఇంటికి రాలేదు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో ఆమె అన్న రాజ్‌బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

బయటకు వెళ్లిన గృహిణి.. 
జగద్గిరిగుట్ట: ఇంటి నుండి బయటకు వెళ్లిన గృహిణి అదృశ్యమైన ఘటన జగద్గిరిగుట్ట పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. చంద్రగిరినగర్‌కు చెందిన మహేష్, మనీష (25) లు భార్యాభర్తలు. వీరికి మయూర్, మనల్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రైవేట్‌ ఉద్యోగం చేసే మనీష ఈ నెల 3న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో చెత్తపారబోయడానికి వెళ్తున్నానని పిల్లలకు చెప్పి వెళ్లింది. అయితే సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన భర్త ఆమె కోసం వెతకగా ఆచూకీ తెలియలేదు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

వ్యాపారం నిమిత్తం వెళ్లిన వ్యక్తి.. 
జగద్గిరిగుట్ట: వ్యాపారం నిమిత్తం వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన జగద్గిరిగుట్ట పీఎస్‌ పరిధిలో చోటు కేసుకుంది. వల్లభాయ్‌ పటేల్‌నగర్‌కు చెందిన చొక్కయ్య కుమారుడు సతీష్‌ (29) ప్రైవేట్‌ ఉద్యోగి. వృత్తిరీత్యా వ్యాపారి. గత నెల 29న పని నిమిత్తం భద్రాచలంకు వ్యాపారం నిమిత్తం వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. అదే రోజు రాత్రి కుమారుడితో చొక్కయ్య మాట్లాడగా 30వ తేదీ ఉదయం ఫోన్‌చేస్తే స్విచ్ఛాఫ్‌ వచ్చింది. అదే రోజు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఓ వ్యక్తి ఫోన్‌ చేసి సతీష్‌ ఫోన్‌ స్విచ్ఛాప్‌ అయిందని, తాను సైట్‌లో ఉన్నానని చెప్పాడు. తిరిగి అతని ఫోన్‌ను ప్రయత్నించగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సతీష్‌ కోసం వెతకగా అతని జాడ తెలియలేదు. ఆదివారం కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top