‘మాయా’ శిల్పం: లాకరుంది.. డబ్బుల్లేవు

Telangana: Narsingdi Police Inquired Over Shilpa Chowdhury - Sakshi

ఖాళీగా శిల్పా బ్యాంకు లాకర్‌

హాస్పిటల్‌ సొసైటీ, విల్లా జిరాక్స్‌ పత్రాలు లభ్యం.. మూడోసారి విచారించిన నార్సింగి పోలీసులు

డబ్బు, బినామీ ఆస్తులపై నోరు మెదపని శిల్ప

మణికొండ: అధిక వడ్డీలు, రియల్‌ వ్యాపారా లంటూ సంపన్న మహిళల నుంచి రూ. కోట్లు దండుకున్న శిల్పా చౌదరిని నార్సింగి పోలీసులు మూడోసారి విచారించారు. బెయిల్‌ పిటిషన్‌ను సోమవారం రాజేంద్రనగర్‌ కోర్టు రద్దు చేసి మరోసారి పోలీసు కస్టడీకి అనుమతించటంతో మంగళవారం చంచల్‌గూడ జైలు నుంచి నార్సింగికి ఆమెను తీసుకొచ్చారు.

తర్వాత కోకాపేటలోని యాక్సిస్‌ బ్యాంక్‌కు తీసుకెళ్లి లాకర్‌ను తెరిపించారు. అందులో డబ్బు లేకపోవటంతో పోలీసులు నిరాశ చెందారు. ఓ ఆస్పత్రి సొసైటీ పత్రాలు, గండిపేటలోని తన సిగ్నేచర్‌ విల్లా జిరాక్స్‌ పత్రాలు ఉంటే వాటిని స్వాధీనం చేసుకున్నారు. 

డబ్బులేం చేశావని అడిగితే..
ఫిర్యాదు చేసిన మహిళల నుంచి తీసుకున్న డబ్బును ఏం చేశావని, బినామీ పేర్లతో ఎక్కడ ఆస్తులు కొన్నావని శిల్పను పోలీసులు ప్రశ్నించారు. దానికి జవాబుగా హయత్‌నగర్‌లో తనకు 240 గజాల భూమి ఉందని, విల్లా.. బ్యాంక్‌ లోన్‌లో ఉందని, బయటకు రాగానే వాటిని అమ్మి డబ్బులు ఇచ్చిన వారికి తిరిగి ఇచ్చేస్తానని చెప్పినట్టు తెలిసింది.

హాస్పిటల్‌ సొసైటీలో పెట్టుబడులు పెట్టినట్టు, అందులో మోసపోయానని చెప్పినట్టు సమాచారం. యాక్సిస్‌ బ్యాంక్‌కు వచ్చిన సందర్భంగా మీడియా శిల్పను తన వాదన చెప్పాలని కోరగా వాళ్లను తప్పించుకుని పోలీసు వాహనం ఎక్కింది. ఆమెను బుధవారం తిరిగి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు. 

పక్కా స్కెచ్‌తోనే..
సంపన్న మహిళలే టార్గెట్‌గా వారితో ఫ్రెండ్‌షిప్‌ చేసిందని, వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి వారిని కిట్టీ పార్టీలకు పిలిచి పక్కా స్కెచ్‌తోనే డబ్బు దండుకుని ఎక్కడ పెట్టిందో చెప్పట్లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. వారి నుంచి డబ్బు తీసుకుని కొన్ని నెలలు వడ్డీ చెల్లించడం, తీరా విషయం పోలీసు స్టేషన్‌కు వచ్చిందనగానే అకౌంట్లు, లాకర్లలో డబ్బుల్లేకుండా చేయటం, విచారణలో నోరు విప్పకపోవటం వాటికి బలం చేకూరుస్తున్నాయని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

తనకు డబ్బులు ఇచ్చే వారిని ముంచాలనే తరచూ కిట్టీ పార్టీలను ఏర్పాటు చేసి వాటిల్లో తనకు లేని దర్పాన్ని ప్రదర్శించగా ఆ ఎత్తుకు కొందరు మహిళలు చిక్కి మోసపోయారని పలువురు చెబుతున్నారు. వారికి న్యాయం చేసేందుకు పోలీసులు ఎంతలా ప్రయత్నించినా ఫలితం ఆశించినంతగా దక్కలేదని అంటున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top