పంచాయితీ పెడితే.. సెట్‌ అయ్యాడనుకున్నారు.. మైనర్‌ ఫోన్‌ నంబర్‌ సేకరించి..

Student Was Raped For Love In Yadadri Bhuvanagiri District - Sakshi

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి.. 

మోత్కూరు: ప్రేమ వేధింపులకు ఓ విద్యార్థిని బలైంది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మండలం పనకబండ గ్రామానికి చెందిన బట్టు రాజమల్లు కూతురు దుర్గాభవాని (17) మున్సిపల్‌ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. కాగా, దుర్గాభవానిని అదే గ్రామానికి చెందిన గురజాల ఏలేందర్‌ ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు.

వీరి నివాసాలు పక్క పక్కనే ఉండడంతో దుర్గాభవాని కాలేజీకి వెళ్లి వచ్చే క్రమంలో స్నేహితులతో కలిసి ఏలేందర్‌ ఇబ్బంది పెడుతున్నాడు. ఏడాది క్రితం ఏలేందర్‌ తన కూతురును వేధిస్తున్న విషయం రాజమల్లుకు తెలిసింది. దీంతో ఆయన పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. అప్పట్లో ఏలేందర్‌.. ఇకపై దుర్గాభవానిని ఇబ్బంది పెట్టనని అందరి సమక్షంలో ఒప్పుకున్నాడు. తదనంతరం హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.  

తిరిగొచ్చి మళ్లీ అదే తీరు.. 
ఏలేందర్‌ కొద్ది రోజుల క్రితం స్వగ్రామానికి తిరిగొచ్చాడు. స్నేహితుల సహకారంతో దుర్గాభవాని ఫోన్‌ నంబర్‌ సేకరించి మళ్లీ వేధింపులు మొదలుపెట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన దుర్గాభవాని ఇంట్లోనే గడ్డిమందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు బాలికను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఇంటికి తీసుకొచ్చారు. అకస్మాత్తుగా ఈ నెల 20న ఆమె తీవ్ర అస్వస్థతకు గురవడంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

అదేరోజు సాయంత్రం మృతి చెందింది. ఏలేందర్, మరో ఏడుగురు స్నేహితులతో వేధించడంతోనే దుర్గాభవాని ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులు పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జి.ఉదయ్‌కిరణ్‌ తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top