రెండుసార్లు హత్యాయత్నం.. ప్రాణం తీసిన వివాహేతర సంబంధం! | Sakshi
Sakshi News home page

పెళ్లికి ముందే భార్యకు వివాహేతర సంబంధం!.. రెండుసార్లు హత్యాయత్నం.. చివరికి

Published Sun, Aug 21 2022 9:17 AM

Singareni Worker Shot Dead in Godavarikhani Over Wife Extra Marital Affair - Sakshi

సాక్షి, కరీంనగర్‌: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సింగరేణి కార్మికుడిని ఇద్దరు వ్యక్తులు పిస్తోల్‌తో కాల్చిచంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శుక్రవారం అర్థరాత్రి జరిగిన ఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన కోరుకొప్పుల మొండయ్య అమృత దంపతుల కుమారుడు రాజేందర్‌కు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట్‌ గ్రామానికి చెందిన రవళితో ఏడేళ్ల క్రితం వివాహమైంది.

వీరికి ఇద్దరు కుమారులు ఆదిత్య (7), కార్తికేయ (4) సంతానం. రాజేందర్‌ శ్రీరాంపూర్‌ ఏరియా ఆర్కే–7లో జనరల్‌ మజ్దూర్‌గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజూ ద్విచక్రవాహనంపై విధులకు వెళ్లి వస్తున్నాడు. అయితే రాజేందర్‌ శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా.. సుమారు 1.30 గంటల నుంచి రెండు గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై హెల్మెట్‌ పెట్టుకుని వచ్చి ఇంట్లోకి ప్రవేశించారు.

అప్పటికే నిద్రిస్తున్న రాజేందర్‌పై వెంట తెచ్చుకున్న పిస్తోల్‌తో కుడివైపు కణతపై రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఉదయం ఐదు గంటలవరకూ నిందితులు రాజేందర్‌ ఇంటిముందున్న గద్దెపైనే కూర్చున్నట్లు స్థానికులు చెబుతున్నారు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ్నుంచి రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.  
చదవండి: ముంబైలో రూ.5 కోట్ల కొకైన్‌ పట్టివేత 

వివాహేతర సంబంధమే కారణమా? 
రవళికి పెళ్లికి ముందే తన మేనబావ, కిష్టంపేట్‌కు చెందిన బందం రాజుతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా చంపించాలని భావించింది. కొన్నాళ్ల క్రితం విధులు ముగించుకుని ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తున్న రాజేందర్‌ను కారుతో ఢీకొట్టి చంపించేందుకు ప్రయత్నించగా.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రమాదంగా భావించి పెద్దగా పట్టించుకోలేదు.

మరోసారి ఇంటిముందు గేట్‌కు కరెంట్‌ పెట్టి చంపాలని ప్రయత్నించగా..దాన్ని కూడా ప్రమాదంగానే రాజేందర్‌ భావించాడు. అయితే తాజా ఘటనతో అవి ప్రమాదంగా పరిగణించలేమని స్థానికులు చెబుతున్నారు. హత్య సమయంలో రవళి బాత్రూమ్‌లోకి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. బందం రాజు, అతని మిత్రుడు సయ్యద్, కోడలు రవళి కలిసి తమ కొడుకును తుపాకీతో కాల్చి చంపినట్లు మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు 
సాంకేతిక ఆధారాలతో నిందితులను మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బందం రాజు, అతని మిత్రుడు సయ్యద్‌గా పోలీసులు గుర్తించారు. మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నామని, ఫోరెన్సిక్‌ నిపుణులు, డాగ్‌స్క్వాడ్‌ బృందాన్ని రప్పించి తనిఖీలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

షార్ట్‌వెపన్‌తో కాల్చారు..  
షార్ట్‌వెపన్‌తో కాల్చినట్లు భావిస్తున్నాం. నిందితులను పట్టుకోవడానికి రెండు బృందాలను ఏర్పాటు చేశాం. హత్యకు వాడింది లైసెన్స్‌డ్‌ వెపనా..? లేక దేశీ కట్టా వెపనా..? తేలాల్సి ఉంది. హత్యకు సంబంధించిన ఏమైనా వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలి.  
–రూపేష్, పెద్దపల్లి డీసీపీ

Advertisement
 
Advertisement
 
Advertisement