‘అంగడి తిప్పడం’ కోసం వెళ్లి వస్తూ..

Road Accident In Kamareddy District - Sakshi

ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మహిళలు సహా 9 మంది మృతి 

ముగ్గురు చిన్నారులతో పాటు 16 మందికి తీవ్రగాయాలు..  

మృతులు, క్షతగాత్రులందరూ సమీప బంధువులే 

25 మంది ప్రయాణిస్తున్న టాటా ఏస్‌ వాహనాన్ని ఢీకొన్న లారీ 

ఎల్లారెడ్డి–బాన్సువాడ రహదారిపై దుర్ఘటన 

బాధితుల ఆర్తనాదాలతో భయానక వాతావరణం

నిజాంసాగర్‌: కొడుకు దినకర్మ తర్వాత ‘అంగడి తిప్పడం’ కోసం వెళ్లి వస్తూ తల్లి సహా సమీప బంధువులు తొమ్మిది మంది ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఈ హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. మృతుల్లో ఆరుగురు మహిళలు కాగా, ముగ్గురు చిన్న పిల్లలు సహా 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

జిల్లాలోని ఎల్లారెడ్డి–బాన్సువాడ రహదారిపై అన్నాసాగర్‌ తండా సమీపంలో ఆదివారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా..మిగతా ఏడుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణించారు. రక్తం మడుగులో విలవిల్లాడుతున్న క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.  

టాటా ఏస్‌లో కిక్కిరిసి వెళుతూ.. 
పిట్లం మండలం చిల్లర్గి గ్రామానికి చెందిన చౌదర్‌పల్లి మానయ్య ఈ నెల 4వ తేదీన మరణించాడు. శనివారం దినకర్మ పూర్తయ్యింది. కులాచారం ప్రకారం బంధువులు.. మానయ్య కుటుంబ సభ్యులను ఆదివారం ‘అంగడి తిప్పడం’కార్యక్రమం కోసం ఎల్లారెడ్డి సంతకు తీసుకువచ్చారు. సాయంత్రం వరకు ఎల్లారెడ్డి అంగడిలో గడిపిన 25 మంది టాటా ఏస్‌ వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు.

ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్‌ తండా వద్ద ఎదురుగా బియ్యం లోడుతో వస్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్న ఆటో ట్రాలీని వేగంగా ఢీకొట్టింది. ట్రాలీ నుజ్జునుజ్జు కాగా లారీ రోడ్డు పక్కకు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్‌ డ్రైవర్‌ పెద్దకొడప్‌గల్‌ మండలం తుక్దల్‌ గ్రామానికి చెందిన సాయిలు (32) అందులోనే ఇరుక్కుని చనిపోయాడు. ట్రాలీలో కూర్చున్న పిట్లం మండలం చిల్లర్గి గ్రామానికి చెందిన చౌదరిపల్లి లచ్చవ్వ (58) కూడా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయింది.  

ఆస్పత్రుల్లో ఏడుగురు.. 
క్షతగాత్రులను ఎల్లారెడ్డి పోలీసులు స్థానికులు, ప్రయాణికుల సహకారంతో ఎల్లారెడ్డి, బాన్సువాడ ఆస్పత్రులకు అంబులెన్సుల్లో తరలించారు. ఎల్లారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాన్సువాడకు చెందిన అంజవ్వ (40) చనిపోగా, బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో చిల్లర్గికి చెందిన చౌద రిపల్లి వీరమణి (38), సాయవ్వ (45), పిట్లం మండలం కాటేపల్లికి చెందిన సర్వగళ్ల ఎల్లయ్య (52) మృతిచెందారు. గాయపడ్డ కొందరిని ఎల్లారెడ్డి, బాన్సువాడ ఆస్పత్రుల్లో ప్రాథమిక చికిత్స అనంతరం నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ వీరవ్వ (70), చిల్లర్గికి చెందిన గంగవ్వ (44), పోచయ్య (55) మృత్యువాత పడ్డారు. మరణించిన వీరవ్వ మానయ్య తల్లి కాగా టాటా ఏస్‌ డ్రైవర్‌ సాయిలు ఆయన మేనల్లుడు. మిగిలిన వారు కూ డా సమీప బంధువులే. వీరిలో లచ్చవ్వ, వీరమణి అత్తాకోడళ్లు. ఎల్లారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎల్లారెడ్డి నుంచి ట్రాలీ బయలుదేరిన పది నిమిషాలకే ప్రమాదం చోటు చేసుకుంది. మరో అరగంట గడిస్తే చిల్లర్గికి చేరుకునే వారని, అక్కడి నుంచి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లేవారని బంధువులు విలపిస్తూ చెప్పారు. తమవారి మరణ వార్తతో ఆయా గ్రామాల్లో విషాదం నెలకొంది. 

ఏమిటీ అంగడి తిప్పడం.. 
జుక్కల్‌ నియోజకవర్గంలోని కొన్ని కులాలలో చనిపోయిన వారి దినకర్మల అనంతరం.. కుటుంబ సభ్యులు, బంధువులకు ఆ బాధ నుంచి కొంత ఉపశమనం కలిగేలా ఎక్కడైనా అంగడి (సంత)కి తీసుకువెళ్లి తిప్పడం, విందు ఇవ్వడం ఆచారంగా వస్తోంది. బంధువులంతా తలా కొంత చొప్పున డబ్బు జమ చేసుకుని ఆ డబ్బులతో సంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top