కంచికచర్ల వద్ద పట్టుబడ్డ డబ్బు ఎవరిది?

Police inquire into Rs 50 lakh seized at Kanchikacharla - Sakshi

రూ.50 లక్షలపై పోలీసుల ఆరా

రూ.3 కోట్లు నగదు దొరికినట్టు ప్రచారం

రంగంలోకి టీడీపీ నేతలు ?

సాక్షి, అమరావతి: ఈ నెల 20వ తేదీన ఉదయం 5.30 గంటలకు విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న గరుడ బస్సును కంచికచర్ల వద్ద పోలీసులు తనిఖీ చేసినప్పుడు పట్టుబడిన రూ.50 లక్షలు ఎవరివనే ప్రశ్న పోలీసుల బుర్రను తొలుస్తోంది. ఆ డబ్బులు తీసుకెళ్తున్న మహా న్యూస్‌ రిపోర్టర్‌ ఏఎన్‌వీ సూర్యనారాయణను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ మొత్తానికి సరైన ఆధారాలు చూపించక పోవడంతో పూచీకత్తు రాయించుకుని అతడిని విడిచి పెట్టారు. అయితే అదే బస్సులో హైదరాబాద్‌లో రూ.3 కోట్లు నగదు దొరికినట్టు ప్రచారం జరుగుతోంది. బస్సులో ఇంత పెద్ద మొత్తాన్ని ఎవరికి ఇచ్చేందుకు తీసుకెళ్తున్నారు? అనే కోణంలో పోలీసులు దృష్టి సారించే దశలో టీడీపీ నేతలు రంగంలోకి దిగినట్టు విశ్వసనీయ సమాచారం.

టీడీపీకి చెందిన రాష్ట్ర మాజీ మంత్రి ఒకరు, గతంలో టీడీపీలో కొనసాగిన కేంద్ర మాజీ మంత్రి ఒకరు ఈ విషయంలో పోలీసులు లోతుగా వెళ్లకుండా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.  దీంతో పోలీస్‌ ఉన్నతాధికారులు స్థానిక పోలీసుల తీరుపై ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా ఆ డబ్బును హైదరాబాద్‌లో ఉండే ఆ చానల్‌ కీలక ప్రతినిధికి అందజేసేందుకు వెళ్తున్నట్లు తెలిసింది. టీడీపీ హయాం నుంచి ఒక వెలుగు వెలుగుతున్న ఆ సీనియర్‌ జర్నలిస్టు విశాఖలో ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, బిల్డర్‌ను బెదిరించి ఈ డబ్బు రాబట్టినట్లు సమాచారం. కాగా, పట్టుబడిన రూ.50 లక్షలను విశాఖ మహా న్యూస్‌ రిపోర్టర్‌ క్రాంతికుమార్‌ తనకు ఇచ్చినట్లు ఏఎన్‌వీ సూర్యనారాయణ చెప్పాడని, అతన్ని కూడా పిలిచి ఆరా తీస్తామని రూరల్‌ సీఐ సతీష్‌ తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top