
సాక్షి, చండూరు: కరోనా కాలంలో.. ఇక ప్రభుత్వ ఉద్యోగం రాదని మనస్తాపానికి గురైన ఓ పీజీ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాక రామచంద్రం, గంగమ్మకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు పాక శ్రీకాంత్ (25) రెండేళ్ల క్రితమే బాటనీలో పీజీ పూర్తిచేశాడు.
తండ్రి గతంలోనే అనారోగ్యంతో మృతిచెందగా, తల్లి మానసిక రోగి కావడంతో శ్రీకాంత్ స్వయంకృషితో చదువుకున్నాడు. ఉద్యోగవేటలో ఉండగా కరోనా విజృంభిస్తుండడంతో తనకిక ఉద్యోగం రాదని మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం సాయంత్రం పొలం వద్ద పురుగుల మందు తాగాడు. అపస్మారకస్థితిలో ఉన్న అతడిని ఇరుగుపొరుగు రైతులు గమనించి 108లో నల్లగొండ జనరల్ ఆస్పత్రికి తరలించేలోగా చనిపోయాడు.