హత్య జరుగుతుందని ఊహించలేదు | Not expected To Renuka Swamy Murder says Pavithra Gowda | Sakshi
Sakshi News home page

హత్య జరుగుతుందని ఊహించలేదు

Published Sat, Jun 15 2024 7:17 AM | Last Updated on Sat, Jun 15 2024 2:02 PM

Not expected To Renuka Swamy Murder says Pavithra Gowda

    పోలీసుల వద్ద వాపోయిన నటి పవిత్రగౌడ '

    విచారణలో నోరు విప్పని దర్శన్‌ 

    హత్య జరిగిన ప్రాంతానికి దర్శన్‌ను తీసుకెళ్లిన పోలీసులు 

    రేణుకాస్వామి హత్యోదంతంలో మరో ఇద్దరి అరెస్ట్‌

దొడ్డబళ్లాపురం: తనకు అసభ్యంగా మెసేజ్‌లు పెడుతున్నాడని రేణుకాస్వామి గురించి దర్శన్‌కు చెప్పానే కానీ, హత్య చేస్తారని అసలు ఊహించలేదని రేణుకాస్వామి హత్య కేసులో మొదటి నిందితురాలిగా ఉన్న పవిత్రగౌడ చెప్పుకొచ్చారు. పోలీసుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆమె.. రేణుకాస్వామిని హత్య చేస్తారని ఏమాత్రం అనుమానం వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకునేదాన్నని అన్నారు. అశ్లీల మెసేజ్‌ విషయం దర్శన్‌కు తెలిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తనకు తెలుసని, అందుకే మొదట దర్శన్‌కు చెప్పకుండా ఆ మెసేజ్‌ను పవన్‌కు చూపించినట్లు చెప్పినట్లు సమాచారం.  

నోరు విప్పని దర్శన్‌  
రేణుకాస్వామి హత్యకు సంబంధించి పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు దర్శన్‌ తనకు ఏమీ తెలీదని చెప్పడం లేదా మౌనంగా ఉండిపోతున్నాడని తెలిసింది. ఈ కేసులో అరెస్టైన దర్శన్‌ ప్రియురాలు పవిత్రగౌడ ఇతర నిందితులు చాలా ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తుండగా దర్శన్‌ మాత్రం చెప్పిందే చెబుతున్నట్లు సమాచారం. అయితే రేణుకాస్వామిని స్కెచ్‌ వేసి హత్య చేయలేదని, బెదిరించి కొట్టి భయపెట్టి వదిలేయాలనుకున్నామని,   దెబ్బలు తట్టుకోలేని రేణుకాస్వామి మృతి చెందినట్లు నిందితులు చెబుతున్నారు. 

 ఇదిలా ఉండగా గురువారం రాత్రి రేణుకాస్వామి కేసుకు సంబంధించి పోలీసులు చిత్రదుర్గలో స్పాట్‌ మహజర్‌ నిర్వహించారు. పగటి సమయంలో మీడియా, జనాల వల్ల పని కాదని భావించిన పోలీసులు గురువారం అర్థరాత్రి చిత్రదుర్గలో సీఐ సంజీవ్‌ గౌడ... నిందితుడు రఘును తీసుకువచ్చి రేణుకాస్వామిని కిడ్నాప్‌ చేసిన స్థలం, సంఘటనకు సంబంధం ఉన్న ఇతర చోట్ల మహజర్‌ చేశారు. రఘు దర్శన్‌ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. రేణుకాస్వామిని గుర్తించి కిడ్నాప్‌ చేయడంలో రఘు కీలకంగా వ్యవహరించారు. 

నగదు సీజ్‌   
రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌ పేరు బయటకు రాకుండా కుదుర్చుకున్న డీల్‌ ప్రకారం చేతులు మారిన రూ.30 లక్షల నగదు పోలీసులు సీజ్‌ చేసినట్టు సమాచారం. దర్శన్‌ ఇచ్చిన రూ.30 లక్షలు దర్శన్‌కు సంబంధించిన దగ్గరి వ్యక్తి ఇంట్లో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు ఇంటిపై రైడ్‌ చేసి నగదు సీజ్‌ చేశారు.   

అవకాశం దొరికినా తప్పించుకోని రేణుకాస్వామి  
రేణుకాస్వామిని కిడ్నాప్‌ చేసి చిత్రదుర్గ నుంచి బెంగళూరు తీసుకువచ్చే క్రమంలో మార్గం మధ్యలో అనేకసార్లు తప్పించుకునే అవకాశం లభించినా తప్పించుకోలేదని పోలీసుల దర్యాప్తులో తెలిసింది.  ఏ8గా ఉన్న నిందితుడు రవి పోలీసులకు లొంగిపోయాడు. రవి ఇచ్చిన సమాచారాన్ని పోలీసులు మీడియాకు వివరించారు. నిందితుడు రవి క్యాబ్‌ డ్రైవర్‌. టొయోటా ఈటీఎస్‌ కారు అద్దెకు నడుపుతుంటాడు. ఈక్రమంలో రవి స్నేహితుడు జగ్గు కాల్‌ చేసి బెంగళూరుకు వెళ్లాలని కోరాడు. చిత్రదుర్గలో జగ్గు, రఘు, అను, రేణుకాస్వామి కారు ఎక్కారు. కారులో బెంగళూరు వస్తుండగానే ప్రయాణంలో పవిత్రగౌడకు పంపించిన మెసేజ్‌లపై జగ్గు, రఘు ప్రశ్నించారు. అయితే మెసేజ్‌లు పంపడం తనకు హాబీ అని రేణుకాస్వామి చెప్పుకున్నాడు. వారంతా మార్గం మధ్యలో తుమకూరులో టిఫిన్‌ చేయగా రేణుకాస్వామే బిల్‌ చెల్లించాడు. 

బెంగళూరు వచ్చేలోపు పలుసార్లు కారు నిలిపినా రేణుకాస్వామి తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. కారు బెంగళూరు కామాక్షిపాళ్యలోని షెడ్‌ వద్దకు చేరుకోగానే అక్కడ 30 మంది సిద్ధంగా ఉన్నారు. వారంతా రేణుకాస్వామిని చూసి ఈ బాడీని కొట్టడానికి ఇంతమంది అవసరమా అని నవ్వుకుని కొందరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రేణుకాస్వామిని రఘు లోపలకు తీసికెళ్లగా అను, రవి, జగ్గు చాలాసేపు బయటే వేచి ఉన్నారు. కొన్ని గంటల తరువాత బయటకు వచ్చిన రఘు రేణుకాస్వామి హత్య జరిగిపోయింది, అప్రూవర్‌గా మారతారా? అంటూ ప్రశ్నించాడు. రవి అందుకు నిరాకరించడంతో కారు అద్దె రూ.4వేలు ఇచ్చి పంపించేశాడు. రవి, అను, జగ్గు ముగ్గురూ చిత్రదుర్గకు తిరిగి వచ్చేశారు. అనంతరం హత్య వెలుగు చూసి విషయం పెద్దది కావడంతో భయపడ్డ రవి పోలీసులకు లొంగిపోయాడు.

మరో ఇద్దరి అరెస్ట్‌  
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో మరో ఇద్దరు పట్టుబడ్డారు.  చిత్రదుర్గకు చెందిన అనుకుమార్‌ ఆలియాస్‌ అను, జగదీష్‌ ఆలియాస్‌ జగ్గును పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో అరెస్ట్‌ అయిన వారి సంఖ్య  16కి చేరింది. రేణుకాస్వామిని కిడ్నాప్‌ చేసి చిత్రదుర్గ నుంచి బెంగళూరు తీసుకురావడంలో వీరు ఇద్దరూ కీలకంగా వ్యవహరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement