ఆన్‌లైన్‌ వ్యాపారం ముసుగులో భారీ సైబర్‌ మోసం

Massive cyber fraud in pursuit of online business - Sakshi

ప్రత్యేక యాప్‌ రూపొందించి వేలాది మందిని ఆకర్షించిన సంస్థ

రూ.కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన వైనం

పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితులు 

విజయవాడ స్పోర్ట్స్‌: ఆన్‌లైన్‌ వైద్య పరికరాల వ్యాపారం ముసుగులో జరుగుతున్న సైబర్‌ మోసం విజయవాడలో వెలుగు చూసింది. నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి మోసపోయామంటూ శనివారం సాయంత్రం సైబర్, సూర్యారావుపేట పోలీసులను ఆశ్రయించారు. ఈ ఏడాది జూన్‌ చివరి వారంలో టెలివియా అనే సంస్థ లవ్‌లైఫ్‌ అండ్‌ న్యాచురల్‌ హెల్త్‌కేర్‌ పేరుతో ప్రత్యేకమైన యాప్‌ను రూపొందించి ఆన్‌లైన్‌లో వైద్య పరికరాల విక్రయం ప్రారంభించింది.

ఈ యాప్‌లో ఉన్న వైద్య పరికరాలను కొనుగోలు చేయండి.. సదరు పరికరాలను మేమే అద్దెకు ఇచ్చి, వచ్చిన లాభాన్ని మీకు ఇస్తామనే బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. కరోనా సమయంలో వైద్య పరికరాలకు గిరాకీ పెరిగిన నేపథ్యంలో ఈ వ్యాపారంలో పెట్టుబడి పెడితే లక్షలు ఆర్జించవచ్చనే ఆశతో ఎంతో మంది ఈ యాప్‌ను డౌన్‌లోన్‌ చేసుకుని వైద్య పరికరాలపై పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు.

ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న పెట్టుబడిదారులతో 372 టెలిగ్రాం గ్రూపులను (ఒక్కో గ్రూపునకు 250 మంది సభ్యులు) ఏర్పాటు చేసి వ్యాపారం లావాదేవీలను ఎప్పటికపుడు అప్‌డేట్‌ చేశారు. అక్టోబర్, నవంబర్‌ నెలల్లో వచ్చిన లాభాలను ఎప్పటికప్పుడు పెట్టుబడిదారులకు ఇచ్చేయడంతో పాటు తరుచూ గిఫ్ట్‌ కూపన్‌లను ఇవ్వడంతో వేలాది మంది ఈ వ్యాపారం పట్ల ఆకర్షితులయ్యారు. ఒక్కొక్కరు రూ.లక్షల్లో నగదును నిర్వాహకులకు యూపీఐ (ఫోన్‌ పే, గూగుల్‌ పే) ద్వారా పంపారు.

ఈ నెల 19వ తేదీ నుంచి సంస్థ బోర్డ్‌ తిప్పేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నగర ప్రజల నుంచి ఈ సంస్థ కోట్లాది రూపాయలు వసూలు చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించి, విచారణ చేస్తున్నామని సైబర్‌ సీఐ శ్రీనివాస్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top