Woman Missing: సోడా తాగి వస్తా.. ఇంట్లో నుంచి వెళ్లిన వివాహిత అదృశ్యం

భవానీపురం(విజయవాడ పశ్చిమ): సోడా తాగివస్తానని బయటకు వెళ్లిన ఒక వివాహిత మహిళ తిరిగి ఇంటికి చేరకపోవడంపై శనివారం కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్‌బీనగర్‌లో నివసిస్తున్న చట్టు వీరయ్య ఎయిర్‌పోర్ట్‌లో కేటరింగ్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆయనకు నాలుగేళ్ల క్రితం విజయవాడ భవానీపురం పరిధిలోని ప్రియదర్శినికాలనీకి చెందిన పావని (29)తో వివాహం అయ్యింది. వారికి ఇద్దరు కుమారులున్నారు. ప్రతి క్రిస్మస్ పండుగకు పావని కుటుంబసభ్యులతో కలిసి విజయవాడ పుట్టింటికి వస్తుంది.
చదవండి: Uppada: మత్స్యకారుల వలకు ‘బాహుబలి’
ఈ క్రమంలో ఈ ఏడాది క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఈ నెల 22వ తేదీన పావని తన పిల్లలతో విజయవాడ వచ్చింది. మరునాడు 23వ తేదీ రాత్రి వీరయ్య హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ వస్తుండగా రాత్రి 9.30 గంటలకు ఆయన బావమరిది ఫోన్ చేసి పావని కనిపించడం లేదని, ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వస్తుందని చెప్పాడు. అసలు ఏం జరిగిందని వీరయ్య అడగగా తనకు నీరసంగా ఉందని, సోడా తాగి వస్తానని 7.30 గంటల సమయంలో బయటకు వెళ్లి తిరిగి రాలేదని వివరించాడు. అర్ధరాత్రి విజయవాడ చేరుకున్న వీరయ్య బావమరిదితో కలిసి పావని కోసం చుట్టు పక్కల వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్సై ఎల్.ప్రసాద్ ఉమెన్ మిస్సింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.