నేరగాళ్లతో కలిసి ఖాళీ స్థలాల ఆక్రమణ
నకిలీ డెత్ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్ల సృష్టి
ఆపై నకిలీ గిఫ్ట్ డీడ్‌లతో స్థలాల విక్రయం
రెండు కేసులను ఛేదించిన కీసర పోలీసులు
ఏఎస్‌ఐ సహా ఏడుగురు నిందితుల అరెస్టు
సాక్షి, హైదరాబాద్: భూకబ్జాలను అడ్డుకోవాల్సిన పోలీసే దర్జాగా ఆక్రమణకు తెగబడ్డాడు. ఏకంగా భూకబ్జాదారులతో చేతులు కలిపి ఖాళీ స్థలాల్లో పాగా వేశాడు. కీసర పోలీసు స్టేషన్‌లో నమోదైన రెండు భూకబ్జా కేసుల్లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ) అధికారితో పాటు మరో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేసి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
మల్కాజిగిరి డీసీపీ సీహెచ్. శ్రీధర్ బుధవారం వివరాలు వెల్లడించారు. కొన్నేళ్లుగా ఖాళీగా ఉంటున్న భూములు, సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చెందిన స్థలాలపై కన్నేసి, నకిలీ పత్రాలను సృష్టించే ముఠా సభ్యులు ప్రవీణ్ రెడ్డి, మోడెమ్ సంపత్, కాంబ్లే దీపలతో ఏఎస్‌ఐ కనకాటి లింగయ్య గౌడ్ జట్టు కట్టాడు.
ఈ ముఠా ప్రధానంగా ఖాళీగా ఉన్న ప్లాట్లను, యజమానులు అందుబాటులో లేని భూములను లక్ష్యంగా చేసుకుంటుంది. తొలుత అసలు యజమానుల వివరాలు సేకరించి, వారు చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికేట్లు సృష్టిస్తారు. ఆపై నకిలీ వారసులను పుట్టించి, గిఫ్ట్ సెటిల్‌మెంట్ డీడ్‌లు, సేల్ డీడ్‌ల ద్వారా భూములను తమ అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తారు.
రెండు వేర్వేరు కేసులు..
ఈ నెల 16, 17 తేదీల్లో కేశబోయిన రమాదేవి, మాధురి అనే ఇద్దరు మహిళా బాధితులు తమ భూములను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫోర్జరీ పత్రాలతో ఇతరులకు బదలాయించారని కీసర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఖాళీ స్థలాలను వెతికి యజమాని మరణ ధ్రువీకరణ పత్రాల నుంచి కుటుంబ సభ్యుల సర్టిఫికెట్ల వరకు అన్నింటినీ ఫోర్జరీ చేస్తూ, యజమానులకు తెలియకుండానే ఆస్తులను రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు.
సాంకేతిక ఆధారాలతో మొదటి కేసులో ఏఎస్‌ఐ కనకాటి లింగయ్య గౌడ్, ప్రవీణ్ రెడ్డి, మోడెమ్ సంపత్, కాంబ్లే దీపలను, రెండో కేసులో ఉప్పల వేణు, దొనపాటి వెంకట్ రెడ్డి, గుండిగ జ్యోతి, మదాను ఇన్నయ్యలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఫోర్జరీ చేసిన పత్రాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో మిగతావారి కోసం గాలిస్తున్నారు.


