రికవరీ ఏజెంట్ల దూషణలతో.. ఇంటర్‌ విద్యార్థిని బలవన్మరణం

Inter student Suicide because of Recovery agents - Sakshi

వారు నానా మాటలు అనడంతో తీవ్రమనస్తాపం 

కుటుంబ ఆర్థిక పరిస్థితులూ తోడయ్యాయి 

సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య  

నందిగామ: బ్యాంకు క్రెడిట్‌ కార్డుపై తీసుకున్న రుణం చెల్లించాలంటూ రికవరీ ఏజెంట్ల ఆగడాలు ఓ చదువుల తల్లిని బలితీసుకున్నాయి. తండ్రి తీసుకున్న అప్పు కట్టేయాలనడమే కాక నోటికొచ్చినట్లు నానా మాటలు ఆనడంతో ఆమె తట్టుకోలేకపోయింది. మరోవైపు.. కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగా ఉండడంతో ఆ విద్యార్థిని తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో గురువారం చోటుచేసుకుంది. మృతురాలి తల్లి అరుణ తెలిపిన సమాచారం ప్రకారం..  పట్టణంలోని పాత కరెంట్‌ ఆఫీస్‌ రోడ్డులో ఉంటున్న జాస్తి ప్రభాకరరావు ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు.

ఆయన కొద్దినెలల క్రితం ఓ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా రూ 3.50 లక్షల అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తం సకాలంలో చెల్లించకపోవడంతో వడ్డీ పెరిగిపోయింది. దీంతో ఈ నెల 26న సంబంధిత బ్యాంకు సిబ్బంది ఇంటికొచ్చి తీసుకున్న రుణం వెంటనే చెల్లించాలంటూ అసభ్య పదజాలంతో దూషించారు. ఆ మాటలు విన్న ప్రభాకరరావు పెద్ద కుమార్తె జాస్తి హరిత వర్షిణి (17) తీవ్ర మనస్తాపానికి గురైంది. అప్పటినుంచి అదే ఆలోచనతో ఉన్న ఆమె గురువారం ఉదయం సూసైడ్‌ లెటర్‌ రాసి వంట గదిలో ఉరి వేసుకుని మృతిచెందింది.  

అమ్మా.. నన్ను క్షమించు 
నిజానికి.. హరిత వర్షిణి చిన్నతనం నుంచి చదువులో బాగా శ్రద్ధ చూపేది. పట్టణంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తిచేసుకుని ఏపీ ఈఏపీసెట్‌ (ఎంసెట్‌)లో 15 వేల ర్యాంకు సాధించింది. మరింత మంచి ర్యాంకు కోసం ఈనెల 30న జరగనున్న తెలంగాణ ఎంసెట్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో.. అప్పు చెల్లించాలంటూ బ్యాంకు సిబ్బంది ఇంటికొచ్చి నానా మాటలు అనడం.. అదే సమయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితులు వర్ణిణిని తీవ్రంగా కుంగదీశాయి. కుటుంబానికి తాను భారం కాకూడదనుకుని సూసైడ్‌ నోట్‌ రాసి తనువు చాలించింది. అందులో.. 

‘‘అమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బతకడం కూడా కష్టమవుతుంది. నా కాలేజి ఫీజు, చెల్లి స్కూల్‌ ఫీజుకు కూడా డబ్బుల్లేవు. మావల్ల నీ ఆరోగ్యం పాడుచేసుకోకు. చెల్లిని బాగా చదివించి మంచి ఉద్యోగం తెచ్చుకోమను. నేను నీకు భారం కాకూడదని ఇలాచేశా. నన్ను క్షమించు అమ్మ. నీకు నేనేమీ చేయలేకపోతున్నా. నా గురించి నువ్వు ఏడవకు. చెల్లి జాగ్రత్త. ఎవరన్నా అడిగితే ఎంసెట్‌ ర్యాంకు రాలేదని చనిపోయిందని చెప్పండి.. డాడీకి నిజం చెప్పొద్దు’’.. అంటూ రాసిన లేఖ చూపరులను కంటతడి పెట్టిస్తోంది. 

ఘటనపై అన్ని కోణాలలో దర్యాప్తు 
వర్షిణి మృతిపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌హెచ్‌ఓ కనకారావు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top