హాస్టల్‌లో ఉండలేనమ్మా!, 10 నిముషాల్లోనే ఘోరం

Inter student commits suicide - Sakshi

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

హాస్టల్‌లో ఉండలేనంటూ ఆవేదన 

సర్దిచెప్పిన తల్లి 

పది నిమిషాల్లోనే దారుణం 

పెనమలూరు/పెద్దతిప్పసముద్రం: ఓ ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన పోరంకిలోని శ్రీ చైతన్య క్యాంపస్‌లో సోమవారం చోటు చేసుకుంది. కృష్ణాజిల్లా పెనమలూరు సీఐ ఎం.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం..చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం రంగసముద్రం గ్రామానికి చెందిన మదన్‌మోహన్‌రెడ్డి, మంజుల దంపతుల కుమార్తె బట్టి శిరీష (17) పోరంకిలోని శ్రీచైతన్య సరస్వతీ సౌధంలో ఇంటర్‌ (బైపీసీ) రెండో సంవత్సరం చదువుతున్నది. ఇటీవల ప్రాక్టికల్స్‌ పరీక్ష రాసిన ఆమె తల్లిదండ్రులతో కలిసి ఈ నెల 7వ తేదీన ఇంటికి వెళ్లింది.

మరలా సోమవారం తల్లితో కలిసి పోరంకిలోని కాలేజీకి వచ్చింది. తాను హాస్టల్‌లో ఉండలేనని తల్లికి చెప్పగా.. ఆమె నచ్చజెప్పింది. దీంతో రూమ్‌లోకి వెళ్లి వస్తానని చెప్పి అరుంధతి బ్లాక్‌ రూమ్‌ నంబర్‌ 247లోకి వెళ్లింది. పది నిమిషాలైనా కుమార్తె తిరిగి రాకపోవడంతో తల్లి, కాలేజీ యాజమాన్యం రూమ్‌లోకి వెళ్లి చూడగా శిరీష చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. ఆమెను వెంటనే కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీరించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. సమాచారం అందుకున్న యువతి తండ్రి మదన్‌మోహన్‌రెడ్డి హుటాహుటిన సోమవారం కళాశాలకు వెళ్లారు.   

whatsapp channel

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top