పోలీస్‌ పోస్టింగుల్లో అవినీతి పంట! | Sakshi
Sakshi News home page

పోలీస్‌ పోస్టింగుల్లో అవినీతి పంట!

Published Wed, Jan 26 2022 4:11 AM

Intelligence Affair On MLA From Karimnagar District Over Taking Bribe - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శాంతిభద్రతల విభాగంలో పోస్టింగులకు ఇష్టమొచ్చినట్టుగా సిఫారసు లేఖలిచ్చిన ఓ ఎమ్మెల్యే.. లక్షల రూపాయలు దండుకున్న వ్యవహారం పోలీస్‌ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. అంతేకాదు.. ఒక పోస్టింగ్‌ కోసం ముగ్గురు అధికారుల నుంచి డబ్బులు తీసుకొని, మరో ఇతర అధికారికి పోస్టింగ్‌ కల్పించిన ఉదంతం సంచలనంగా మారింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఈ ఎమ్మెల్యే వ్యవహారంపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు పూర్తిస్థాయిలో నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 

లక్షల్లో వసూలు..ఒకరికని చెప్పి మరొకరికి 
కొద్దిరోజుల క్రితం ‘సాక్షి’ప్రచురించిన పొలిటికల్‌ పోస్టింగ్‌ కథనాలు పోలీస్‌ శాఖలో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై ఇంటెలిజెన్స్‌ విచారణలో బయటకొచ్చిన ఈ ఎమ్మెల్యే అవినీతి బాగోతాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని ఓ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టు కోసం మొదట ఓ సీఐతో రూ.15 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా తన ప్రైవేట్‌ పీఏ ద్వారా రూ.10 లక్షలు తీసుకున్న ఎమ్మెల్యే మరో సీఐకి రూ.18 లక్షలకు సిఫారసు లేఖనిచ్చి పోస్టింగు ఇప్పించారు.

దీంతో ముందు డబ్బులిచ్చిన అధికారి వెళ్లి ఆరాతీయగా ఎక్కడైనా చూద్దాంలే అంటూ దాటవేశారని, తన డబ్బులు తిరిగివ్వాలని అడుగుతున్నా నాలుగు నెలలుగా చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని విచారణలో బయటపడింది. ఇదే నియోజకవర్గంలో మరో సీఐ పోస్టు కోసం ఒక అధికారి నుంచి రూ.10 లక్షలకు డీల్‌ చేసుకొని సిఫారసు లేఖ ఇచ్చారు. ఇదే సీఐ పోస్టింగ్‌ కోసం కరీంనగర్‌లో పనిచేస్తున్న మరో సీఐ నుంచి రూ.13 లక్షలకు ఒప్పందం చేసుకొని అడ్వాన్స్‌గా రూ.3 లక్షలు తీసుకొని మరో సిఫారసు లేఖనిచ్చారు. ఇది తెలిసిన తొలి ఇన్‌స్పెక్టర్‌ వెళ్లి ఎమ్మెల్యేను అడగ్గా.. రూ.15 లక్షలిస్తే పోస్టింగ్‌ ఆర్డర్స్‌ ఇప్పిస్తానని చెప్పడంతో ముందు ఇచ్చిన రూ.10 లక్షలు వెనక్కి రావేమో అని భయపడి మరో రూ.5 లక్షలు సమర్పించుకున్నట్టు తెలిసింది.  

ఇష్టారాజ్యంగా సిఫారసు లేఖలు 
నియోజకవర్గంలో భారీస్థాయిలో డిమాండ్‌ ఉన్న ఓ పోలీస్‌స్టేషన్‌లో పోస్టింగు కోసం ఓ ఎస్‌ఐకి రూ.11 లక్షలకు కమిట్‌మెంట్‌ ఇచ్చారు. అందులో భాగంగా ఓ మండల ఎంపీపీ భర్త ద్వారా రూ.4 లక్షలు అడ్వాన్స్‌ తీసుకొని పోస్టింగ్‌ కల్పించారు. పోస్టింగ్‌ వచ్చాక మిగతా మొత్తం చెల్లించారు. ఆరు నెలలు గడిచాయో లేదో.. సంబంధిత ఎస్‌ఐ తన మాట వినడం లేదని ఇంకో ఎస్‌ఐతో రూ.15 లక్షలకు బేరం కుదుర్చుకుని సిఫారసు లేఖ ఇచ్చాడు. ఇంతలోనే విషయం తెలిసి ప్రస్తుతం ఉన్న ఎస్‌ఐ వెళ్లి అడగడంతో.. ఇంకో రూ.4 లక్షలు ఇస్తే ఏడాది కంటిన్యూ చేస్తానని చెప్పడంతో సదరు ఎస్‌ఐ మరో రూ.4 లక్షలు ముట్టజెప్పుకోవాల్సి వచ్చింది.  

♦ఇదే మండల ఠాణాకు పక్కనే ఉన్న మరో మండల ఠాణా కోసం కరీంనగర్‌ త్రీటౌన్‌లో ఓ ఎస్‌ఐ నుంచి రూ.10 లక్షలకు కమిటై రూ.3 లక్షల అడ్వాన్స్‌ తీసుకొని సిఫారసు లేఖ ఇచ్చారు. మళ్లీ మానకొండూర్‌లో పనిచేస్తున్న ఓ ఎస్‌ఐతో రూ.15 లక్షలకు ఒప్పందం కుదరడంతో అతడికి పోస్టింగ్‌ ఇప్పించే ప్రయత్నం చేశారు. 

♦ఇక ఓ మంత్రి సన్నిహితుడి సోదరుడి పోస్టింగు కోసం రూ.15 లక్షలు తీసుకొని పోస్టింగ్‌ వచ్చేలా చూడగా, మరో స్టేషన్‌కు ఇంకో మంత్రి సిఫారసు చేసినా, సంబంధిత ఎస్‌ఐ నుంచి రూ.5 లక్షలు తీసుకొని పోస్టింగ్‌ ఇప్పించినట్టు ఇంటెలిజెన్స్‌ విచారణలో బయటపడింది.

పొలిటికల్‌ పోస్టింగులపై ప్రభుత్వ పెద్దల ఆగ్రహం 
పొలిటికల్‌ పోస్టింగుల వ్యవహారంలో డబ్బులు తీసుకొని మోసం చేసిన ఘటనలు ప్రభుత్వ పెద్దలను ఆగ్రహానికి గురిచేసినట్టు తెలిసింది. çసదరు ఎమ్మెల్యేపై పోలీస్‌ ఉన్నతాధికారులతో పాటు మంత్రులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అధికారుల నుంచి డబ్బులు తీసుకొని తిరిగివ్వకుండా చేస్తున్న వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలకు ఇంటెలిజెన్స్‌ నివేదిక అందినట్టు పోలీస్‌ వర్గాలు వెల్లడించాయి.   

Advertisement
Advertisement