Alwal Murder Case: ‘ పెళ్లి చేసుకుందాం’.. అన్నందుకు దారుణం

HYD: Boyfriend Held For Assassinated 19 Year Old Girlfriend In Alwal - Sakshi

సాక్షి, అల్వాల్‌: ‘రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. ఇక పెళ్లి చేసుకుందాం’ అని ఒత్తిడి చేసిన ప్రియురాలిని హతమార్చాడో యువకుడు.  ఈ ఘటన అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ఓల్డ్‌ అల్వాల్‌ సాయిబాబానగర్‌కు చెందిన సరస్వతి (19) బోయిన్‌పల్లిలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.

భూదేవినగర్‌కు చెందిన దీపక్‌ (20), సరస్వతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని దీపక్‌పై కొన్నాళ్లుగా ఆమె ఒత్తిడి తెస్తోంది. ఈ విషయంలో అతను దాటవేత ధోరణి ప్రదర్శిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. సోమవారం తన స్నేహితుడికి ఫోన్‌ చేసి సరస్వతిని చంపేస్తున్నానంటూ చెప్పినట్లు తెలిసింది. జోక్‌ చేయవద్దన్న స్నేహితుడు ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన పోలీసులకు చేరవేశారు. ఉదయం ఇంటి నుంచి బయిటికి వెళ్లిన సరస్వతి సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.  

వేగవంతంగా విచారణ.. 
ప్రేమికురాలిని చంపుతానని దీపక్‌ స్నేహితుడు చెప్పిన విషయం.. కనిపించకుండా పోయిన యువతి ఒక్కరే కావడంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రేమికులు తరచూ బీహెచ్‌ఈఎల్‌ క్వార్టర్స్‌ వెనుక ఉన్న రైల్వే ట్రాక్‌ వద్ద కలుసుకునే వారన్న విషయం కనుకొన్నారు. మంగళవారం తెల్లవారుజామున అక్కడికి వెళ్లి చూడగా సరస్వతి మృతదేహం కనిపించింది. చున్నీని గొంతుకు బిగించి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు తేల్చారు. వివాహం విషయంలో ఒత్తిడి వల్లే దీపక్‌ ఆమెను హతమార్చి ఉండవచ్చని తెలుస్తోంది. తమ కూతురిని హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు లక్ష్మణ్, లక్ష్మీదేవి డిమాండ్‌ చేశారు. దీపక్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top