హ్యాండ్‌ గ్రెనేడ్లు పేల్చేశారు!

Hand grenades exploded! - Sakshi

గతేడాది అక్టోబర్‌లో అరెస్టయిన ఉగ్రత్రయం 

దసరా రోజు విధ్వంసాలకు కుట్ర పన్నిన ముగ్గురు 

నిందితుల నుంచి నాలుగు చైనా గ్రెనేడ్లు స్వాదీనం 

న్యాయస్థానం అనుమతితో పేల్చేవేసిన పోలీసులు 

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో గతేడాది దసరా ఉత్సవాల నేపథ్యంలో విధ్వంసాలకు కుట్ర పన్ని చిక్కిన లష్కరేతొయిబా(ఎల్‌ఈటీ) ఉగ్రవాదుల నుంచి స్వాదీనం చేసుకున్న హ్యాండ్‌ గ్రెనేడ్లను పోలీసులు పేల్చేశారు. వీటిని భద్రపరచడం ముప్పుతో కూడిన వ్యవహారం, నిర్విర్యం చేయడం సాధ్యం కాకపోవడంతో సీసీఎస్‌ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ కేసు ఎన్‌ఐఏ బదిలీ కావడంతో ఈ మేరకు ఆ అధికారులకు సమగ్ర నివేదికను అందించింది. 

చైనా గ్రెనేడ్లు మనోహరాబాద్‌ మీదుగా... 
గత ఏడాది అక్టోబర్‌ 2న అరెస్టయిన ఉగ్రత్రయం అబ్దుల్‌ జాహెద్, మహ్మద్‌ సమీయుద్దీన్, మాజ్‌ హసన్‌ ఫారూఖ్‌లు పాకిస్తాన్‌లోని రావల్పిండిలో ఉన్న హ్యాండ్లర్స్‌ ఫర్హతుల్లా ఘోరీ, సిద్ధిఖ్‌ బిన్‌ ఉస్మాన్, అబ్దుల్‌ మాజిద్‌ ఆదేశాల మేరకు పని చేశారు.

దసరా రోజు నగరంలో విధ్వంసాలు సృష్టించేందుకు సిద్ధమైన వీరికి చైనాలో తయారైన హ్యాండ్‌ గ్రెనేడ్లను వారు పంపారు. డ్రోన్లద్వారా కశ్మీర్‌కు వచ్చిన వాటిని అక్కడ నుంచి మెదక్‌ జిల్లాలోని మనోహరాబాద్‌ వరకు చేర్చిన స్లీపర్‌సెల్స్‌ ఓ రహస్య ప్రదేశంలో దాచాయి. అక్కడకు వెళ్లిన సమీయుద్దీన్‌ నాలుగు గ్రెనేడ్స్‌ను తీసుకువచ్చాడు. రెక్కీలు చేస్తుండగానే సిట్‌ అధికారులకు చిక్కారు.  

ఈ కేసుల్లో సీజర్‌ కీలకాంశం... 
ఈ తరహా ఉగ్రవాద సంబంధ కేసుల్లో నిందితుల నుంచి స్వాదీనం చేసుకున్న సీజర్‌ ప్రాపర్టీ నేరం నిరూపణలో కీలక ఆధారంగా మారుతుంది. దీంతోనే కోర్టులో నిందితులను దోషిగా నిరూపించడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సిట్‌ అధికారులు ఉగ్రత్రయం నుంచి స్వాదీనం చేసుకున్న గ్రెనేడ్స్‌ను తొలుత కోర్టులో దాఖలు చేశారు. ఆ పై న్యాయస్థానం ఆదేశాల మేరకు తమ ఆ«దీనంలోనే భద్రపరిచారు.  

ఇవి ప్రమాదకరం కావడంతో తొలు త వీటిని నిర్వీర్యం చేసేందుకే పోలీసులు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే చైనాలో తయారైనవి కావడంతో ఆ ప్రయత్నం చేస్తే పేలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. దీంతో  వీటిని పేల్చేయడమే మేలని భావించి, న్యాయస్థానం అనుమతి అనుమతి పొందారు. ఇటీవల బాంబు నిర్విర్యం బృందాల సమక్షంలో ఈ తంతు పూర్తి చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top