తాత మందలించాడని.. మనమడు ఎంతకు బరి తెగించాడంటే..

Grandson Assassination His Grandfather By Strangling Him With Knife In Kurnool - Sakshi

కర్నూలు: ‘బాగుపడే లక్షణాలు లేవు.. సెల్‌ఫోన్‌ మీద ఉన్న ధ్యాస వృత్తి(పౌరోహిత్యం)పై ఉండటం లేదు. ఇలాగైతే ఎలా ’ అంటూ మందలించిన తాతను.. సొంత మనుమడే కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. స్థానిక మాధవీనగర్‌లో నివాసముంటున్న మేడవరం సుబ్రహ్మణ్య శర్మ (83) వ్యవసాయ శాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ 1996లో పదవీ విరమణ పొందాడు.

సుబ్ర హ్మణ్య శర్మ భార్య శాంతమ్మ 13 ఏళ్ల క్రితం, పెద్ద కుమారుడు సతీష్‌ శకర్మ 14 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందడంతో కోడలు అరుణ(పెద్ద కొడుకు భార్య), మనుమడు దీపక్‌ శర్మ ఉంటున్నారు. దీపక్‌ శర్మ చదువు మధ్యలోనే ఆగిపోవడంతో కులవృత్తి పౌరోహిత్యం నేర్చుకోమని కేసీ కెనాల్‌ వద్ద ఉన్న వినాయక ఘాట్‌ దేవాలయంలో వదిలారు. అయితే పూజా కార్యక్రమాలకు డుమ్మా కొడుతుండటంతో తాత తరచూ మందలించేవాడు.

రెండు రోజుల క్రితం మహానందిలో ఉన్న బంధువుల ఇంటికి స్కూటీపై వెళ్తుండగా బస్సులో వెళ్లమని చెప్పినా పెడచెవిన పెట్టాడు. తిరిగి వచ్చిన తర్వాత కూడా వృత్తిపని నేర్చుకునేందుకు వెళ్లకుండా సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఉండటంతో తాత మరో సారి మందలించాడు. దీంతో ఆలయానికి వెళ్లి కాసేపటికే తిరిగి ఇంటికి వచ్చాడు.

‘ఎందుకంతలోనే వచ్చావు.. వృత్తిపై ధ్యాస లేదా’ అంటూ ప్రశ్నించడంతో ఒక్కసారిగా ఆవేశానికి లోనై కూరగాయల కత్తి తీసుకొని మంచంపై పడుకోబెట్టి గొంతు కోసి హత్య చేశాడు. దుస్తులకు రక్తం అంటడంతో బాత్‌రూమ్‌లో స్నానం చేసి వేరే దుస్తులు వేసుకుని బాబాయి రమేష్‌శర్మకు ఫోన్‌ చేసి తాతను ఎవరో హత్య చేశారంటూ సమాచారమిచ్చాడు. వారు అక్కడికి చేరుకుని రక్తపు మడుగులో పడివున్న సుబ్రహ్మణ్య శర్మను చూసి ఆశ్చర్యపోయారు.

విషయం తెలుసుకున్న మూడో పట్టణ సీఐ తబ్రేజ్, ఎస్‌ఐలు జయశేఖర్, శ్రీనివాసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. నేరం జరిగిన తీరును చూసి దీపక్‌ శర్మపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించగా తనకు తెలియదంటూ బుకాయించడంతో డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలను సేకరించారు. స్టేషన్‌కు తీసుకువెళ్లి తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: థాయ్‌ విద్యార్థినిపై అత్యాచార యత్నం.. హిందీ నేర్పిస్తానని ఇంటికి తీసుకెళ్లి..  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top