ఢిల్లీ గ్యాంగ్‌వార్‌: ఒకప్పటి ఫ్రెండ్స్‌.. శత్రువులుగా ఎందుకు మారారు?

Delhi: Jitender Gogi, Tillu Tajpuria Gang War, Shot Inside Rohini Court - Sakshi

దశాబ్ద కాలంగా గోగి, టిల్లు ముఠాల ఆధిపత్య పోరు

కాలేజీ ఎన్నికల్లో మొదలైన గొడవలు

ఇప్పటివరకు 100 మందికి పైగా మృతి

దేశ రాజధాని ఢిల్లీలో రెండు హంతక ముఠాల గ్యాంగ్‌వార్‌ పెను సంచలనం రేపింది. ఏకంగా న్యాయస్థానం ఆవరణలోనే మారణహోమం సృష్టించింది. మోస్ట్‌ వాండెటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ జితేందర్‌ గోగిని కోర్టు ప్రాంగణంలోనే పట్టపగలు ప్రత్యర్థులు కాల్చి చంపారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు దుండగులు మృతి చెందారు. దుండగులు టిల్లు తాజ్‌పూరియా గ్యాంగ్‌కు చెందిన వారని అనుమానిస్తున్నారు.


కాలేజీ రోజుల నుంచే వైరం

జితేందర్‌ గోగి, టిల్లు తాజ్‌పూరియా ఒకప్పుడు స్నేహితులుగా ఉండేవారు. కాలేజీ స్టూడెంట్‌ యూనియన్‌ ఎన్నికలు వీరిద్దరి మధ్య వైరానికి దారితీశాయి. 2010లో ఔటర్‌ ఢిల్లీలో జరిగిన కాలేజీ విద్యార్థి యూనియన్‌ ఎన్నికల్లో వీరిద్దరి మధ్య మొదలైన గొ​డవలు గ్యాంగ్‌వార్‌గా మారాయి. 2018లో బూరారీ ప్రాంతంలో ఈ రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవల్లో ముగ్గురు చనిపోగా, ఐదుగురు గాయపడ్డారు. రెండు ముఠాల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో ఇప్పటివరకు 100 మందికి పైగా మరణించారని సమాచారం. 


ఎవరీ జితేంద్ర?

గ్యాంగ్‌స్టర్‌ జితేంద్ర మన్‌ అలియాన్‌ గోగి.. ఢిల్లీ-హరియాణా సరిహద్దులోని అలీపూర్‌ ప్రాంతానికి చెందినవాడు. పోలీసులు టాప్‌ మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో అతడి పేరే ముందుంది. 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్తను తీహార్‌ జైలు నుంచి బెదిరించడంతో మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కాడు. కారాగారం లోపల నుంచే హంతక దందా నడిపించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మూడుసార్లు జైలు నుంచి పారిపోయాడు. 2016, జూలై 30న బహదూర్‌గఢ్‌లో పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. గతేడాది మార్చి 3న గురుగ్రామ్‌లోని సెక్టార్‌ 82లో జితేంద్రను పోలీసులు పట్టుకున్నారు. ఈ రోజు రోహిణి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరయ్యేందుకు వెళుతుండగా ప్రత్యర్థుల దాడిలో హతమయ్యాడు.


దశాబ్ద కాలంగా గ్యాంగ్‌వార్‌

టిల్లు తాజ్‌పురియా కూడా తీహార్‌ జైలులో ఉన్నాడు. కారాగారం నుంచే ముఠా కార్యాలపాలు సాగించినట్టు ఇతడిపైనా ఆరోపణలు ఉన్నాయి. 2010 నుంచి గోగి, టిల్లు ముఠాల మధ్య ఆధిపత్య పోరు సాగుతున్నా 2013లో జరిగిన ఘటనతో గ్యాంగ్‌వార్‌ మరింత తీవ్రమైంది. ఢిల్లీకి డాన్‌గా చెప్పుకునే మరో గ్యాంగ్‌స్టర్‌ నీతూ దబోడియా అప్పట్లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. దీంతో జితేంద్ర గోగి, టిల్లు తాజ్‌పురియా మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. దశాబ్ద కాలంగా రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్‌వార్‌ కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీలోని రోహిణి కోర్టు రూమ్‌ 206లో ప్రత్యర్థులు జరిపిన కాల్పుల్లో జితేంద్ర హతమయ్యాడు. లాయర్‌ డ్రెస్‌లో వచ్చిన దుండగులు అతడిని తుపాకులతో కాల్చి చంపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top