కొరియోగ్రాఫర్‌ చైతన్య ఆత్మహత్య

Dance Master Chaitanya Commits Suicide Due to Financial Struggles - Sakshi

నెల్లూరు సిటీ: ‘అతను ఓ టీవీ షోలో డ్యాన్స్‌ మాస్టర్‌ అండ్‌ కొరియోగ్రాఫర్‌. మంచి పేరు వచ్చింది. కానీ సంపాదనలో మాత్రం వెనుకబడ్డాడు. కుటుంబాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని కలలు కన్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏమి చేయలేకపోయాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన అతను ఆత్మహత్యే శరణ్యం అనుకుని నిర్ణయించుకున్నాడు. ఫ్యాన్‌కు ఉరేసుకుని నిండు జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు.’ ఆదివారం పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. లింగసముద్రం మండలంలోని ముత్తంవారిపాళేనికి చెందిన సుబ్బారావు, లక్ష్మి రాజ్యం దంపతులకు సి.చైతన్య (31), వినీల అనే పిల్లలున్నారు. 

చైతన్య హైదరాబాద్‌లో ఉంటూ ఐదేళ్లుగా ఢీ షోలో ఓ బృందానికి  కొరియోగ్రాఫర్‌గా చేస్తున్నాడు. ఈ క్రమంలో నెల్లూరు నగరంలోని టౌన్‌హాల్లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చాడు. అనంతరం నగరంలోని దర్గామిట్లలో ఉన్న నెల్లూరు క్లబ్‌లో గది తీసుకున్నాడు. చైతన్య తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసి స్నేహితులకు పంపాడు. ‘అమ్మా, నాన్న, చెల్లి ఐ లవ్‌ యూ.. నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఏ కష్టం రానివలేదు. చెల్లీ ఫీల్‌ కావద్దు. నువ్వంటే చాలా ఇష్టం. కుటుంబానికి చాలా చేద్దామనుకున్నాను. కుదరలేదు. అప్పులు అవుతాం. తీర్చుకునే సత్తా ఉండాలి. 

తీర్చగలను కానీ అంతా తీర్చ లేకపోతున్నా. ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నా. చాలా ప్రయత్నిస్తున్నా. కావట్లేదు. ఢీ పేరు ఇస్తుంది. కానీ  సంపాదన తక్కువ ఇస్తుంది. జబర్దస్‌లో సంపాదన ఎక్కువ వస్తుంది.  స్నేహితులు, తోటి డ్యాన్సర్లకు సారీ’ అని ఆ వీడియోలో ఉంది. కాగా చైతన్య స్నేహితులు వీడియో చూసి నెల్లూరు పోలీసులకు సమాచారం అందించారు. వారు చైతన్య ఉంటున్న గది వద్దకు చేరుకుని తలుపు తట్టారు. ఎంతకీ తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా అప్పటికే అతను ఉరేసుకుని ఉన్నాడు. దీంతో ధనలక్ష్మీపురంలో నివాసం ఉంటున్న చైతన్య మేనమామ మాల్యాద్రికి పోలీసులు సమాచారం అందించారు. మాల్యాద్రి ఫిర్యాదు మేరకు దర్గామిట్ట ఎస్సై విజయకుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top