ప్రాణం తీసిన లోన్‌ యాప్‌.. న్యూడ్ ఫోటోలు పంపుతామంటూ బెదిరింపులు.. లాడ్జిలో దంపతుల ఆత్మహత్య

Couple Commits Suicide Due To Loan App Harassment In Rajahmundry - Sakshi

కంబాలచెరువు(రాజమహేంద్రవరం)\తూర్పుగోదావరి: కుటుంబ అవసరాల కోసం లోన్‌ యాప్‌లో రుణం తీసుకున్న దంపతులు నిర్వాహ కుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. అల్లూరి సీతారామ రాజు జిల్లా రాజవొమ్మంగి చెందిన కొల్లి దుర్గాప్రసాద్‌ (32), రమ్యలక్ష్మి (24) దంపతులు గత కొంతకాలంగా రాజమహేంద్ర వరంలోని శాంతినగర్‌లో నివసిస్తున్నారు. వీరికి మూడేళ్లు, రెండేళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దుర్గాప్రసాద్‌ జొమాటో డెలివరీ బాయ్‌గా, అతడి భార్య రమ్యలక్ష్మి మిషన్‌ కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
చదవండి: లోన్‌యాప్స్‌ లోగుట్టు: తొందర పడ్డారో.. ఇక అంతే సంగతులు

కాగా కొద్దిరోజుల క్రితం ఇంటి అవసరాల నిమిత్తం సెల్‌ఫోన్‌ ద్వారా లోన్‌ యాప్‌లో కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నారు. అయితే అది సకాలంలో చెల్లించకపోవడం, వడ్డీ పెరిగిపోవడంతో లోన్‌ యాప్‌కు సంబంధించిన టెలీకాలర్స్‌ తరచూ ఫోన్‌ చేసి వేధించేవారు. ‘మీ నగ్న చిత్రాలు మా వద్ద ఉన్నాయి.. అప్పు చెల్లించకపోతే వాటిని బయటపెడతాం’ అని బెదిరించారు. అంతేకాకుండా దుర్గాప్రసాద్‌ బంధువులకు, స్నేహితులకు ఫోన్‌ చేసి అప్పు తీసుకున్న విషయాన్ని చెప్పారు. దీంతో పరువు పోయిందని భార్యాభర్తలిద్దరూ మనస్తాపం చెందారు.

తరచూ లోన్‌ యాప్‌ నిర్వాహకులు ఫోన్‌ చేసి వేధిస్తుండడంతో తట్టుకోలేకపోయారు. ఈ నెల 5న పిల్లలను ఇంటిలో వదిలేసి బయటకు వచ్చిన దంపతులు రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గోదావరి గట్టుపై అదే రోజు రాత్రి ఒక లాడ్జిలో దిగారు. కొద్ది సమయం తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. బం«ధువులకు ఫోన్‌ చేసి తాము చనిపోతున్నామని చెప్పారు. విషయం తెలిసిన బంధువులు అదే రోజు అర్ధరాత్రి సమయానికి లాడ్జి వద్దకు చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న భార్యాభర్తలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం దుర్గాప్రసాద్, రమ్యలక్ష్మి మృతి చెందారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు సోమరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టూటౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top