టాయిలెట్‌ గోడలపై నంబర్‌.. అసభ్య కాల్స్‌! | Cop Flooded With Lewd Calls Teacher Posts Number Toilet Karnataka | Sakshi
Sakshi News home page

మహిళా పోలీసుకు టీచర్‌ వేధింపులు.. ఆపై

Dec 25 2020 2:28 PM | Updated on Dec 25 2020 2:55 PM

Cop Flooded With Lewd Calls Teacher Posts Number Toilet Karnataka - Sakshi

ఆమెను సెక్స్‌ వర్కర్‌గా భావించి అసభ్యకర సంభాషణలతో వేధించడం మొదలుపెట్టారు.

బెంగళూరు: తన వెకిలి చేష్టలకు దీటుగా బదులిచ్చిందన్న కోపంతో మహిళా పోలీసు అధికారి పట్ల అనుచితంగా ప్రవర్తించాడో కామాంధుడు. ఆమె ఫోన్‌ నంబరును పబ్లిక్‌ టాయిలెట్‌ గోడల మీద రాసి నీచ బుద్ధిని బయటపెట్టుకున్నాడు. చివరకు అరెస్టై ఊచలు లెక్కపెడుతున్నాడు. కర్ణాటకలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. చిక్కమగళూరుకు చెందిన సతీశ్‌ సీఎం(33), బాధితురాలు(32) కలిసి చదువుకున్నారు. అతడు స్కూల్‌ టీచర్‌గా పనిచేస్తుండగా, ఆమె పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా మూడేళ్ల క్రితం గెట్‌ టుగెదర్‌ నేపథ్యంలో పూర్వ విద్యార్థులంతా కలిసి ఓ వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. సతీశ్‌, బాధితురాలి నంబర్లు కూడా అందులో యాడ్‌ చేశారు. 

ఇక అప్పటి నుంచి సతీశ్‌ ఆమెకు తరచుగా మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌ చేస్తూ వెకిలిగా మాట్లాడేవాడు. ఇందుకు తీవ్రంగా స్పందించిన ఆమె.. అతడికి వార్నింగ్‌ ఇచ్చారు. దీంతో కోపోద్రిక్తుడైన సతీశ్‌ బాధితురాలిని తమ వాట్సాప్‌ గ్రూపు నుంచి తొలగించగా, ఇతర స్నేహితులు మళ్లీ ఆమె నంబర్‌ను యాడ్‌ చేశారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనవసరంగా తన విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ ఆమె హెచ్చరించడంతో.. సతీశ్‌ ఆమెపై పగ పెంచుకున్నాడు. (చదవండి: గొంతు మార్చి రూ. 36 లక్షలు కొట్టేశాడు)

ఈ క్రమంలో కడూర్‌ బస్టాండులోని పురుషుల టాయిలెట్‌ గోడలపై బాధితురాలి నంబరు రాసి, ఆమెను సంప్రదించాలంటూ నీచపు రాతలు రాశాడు. దీంతో మహిళా పోలీసుకు ఎడతెరపి లేకుండా ఫోన్‌కాల్స్‌ రావడం మొదలైంది. ఆమెను సెక్స్‌ వర్కర్‌గా భావించి అసభ్యకర సంభాషణలతో వేధించడం మొదలుపెట్టారు. ఈ విషయంపై బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో సతీశ్‌ను సోమవారం అరెస్టు చేసిన పోలీసులు.. అతడిపై ఐపీసీ సెక్షన్లు 354డీ, 509(మాటలు, సంజ్ఞలు, చర్యల ద్వారా మహిళను వేధించడం) కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement