ఆ వెబ్‌సైట్‌ను చూస్తుండగా వాట్సాప్‌కు వీడియో.. తీరా చూస్తే అందులో.. | Sakshi
Sakshi News home page

ఆ వెబ్‌సైట్‌ను చూస్తుండగా వాట్సాప్‌కు వీడియో.. తీరా చూస్తే అందులో..

Published Mon, Sep 5 2022 10:00 AM

Cheating With Nude Video Calls On WhatsApp - Sakshi

అనంతపురం శ్రీకంఠంసర్కిల్‌: యువత బలహీనతను ఆసరా చేసుకొని.. అందమైన అమ్మాయిలతో వలపు వల విసిరి అడ్డంగా దోచేస్తున్న సైబర్‌ ముఠా ఆగడాలు పెరిగిపోయాయి. హాయ్‌ అన్న చిన్న పదానికి స్పందిస్తే చాలు గంటల వ్యవధిలోనే వాట్సాప్‌ ద్వారా వచ్చే కాల్స్‌ను వద్దనుకున్నా.. టచ్‌ చేసి తీరుతారు. అందులో నగ్నంగా కనిపించే యువతి ఫొటోను మీరు గమనిస్తుండగా స్క్రీన్‌ షాట్‌ తీసి మళ్లీ మీకే పంపుతారు.
చదవండి: భర్తను దారికి తెచ్చుకోవాలనుకుంది.. చివరికి షాకింగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన భార్య

ఆ తర్వాత బ్లాక్‌మెయిల్‌.. వేధింపులు షరామాములే. అవతలి వారు డిమాండ్‌ చేసిన మేరకు డబ్బు చెల్లించుకోకపోతే మానసిక వేదన తప్పదు. ఈ తరహా చిక్కులో పడి ఎందరో నలిగి పోతున్నారు. వారిలో కొందరు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. మరికొందరు వలపుల వలలో చిక్కుకుని జేబులు గుల్ల చేసుకుంటున్నారు. చాలారోజుల క్రితం రాజస్తాన్‌లోని భరత్పూర్‌కు చెందిన ఓ ముఠాను తెలంగాణా పోలీసులు అరెస్ట్‌ చేసి రూ. 25 కోట్లు కాజేసినట్లు నిర్ధారించారు. 18 రాష్ట్రాల్లో ఈ ముఠా తన నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు అప్పట్లో పోలీసులు గుర్తించారు. ఈ లెక్కన వలపుల వల విసరడంలో ఈ ముఠాలు ఎంతగా ఆరితేరాయో ఇట్టే అర్థమవుతోంది. ఫేస్‌ బుక్‌తో చాటింగ్‌ ప్రారంభించి...వాట్సప్‌తో వసూళ్లకు దిగుతున్న ఈ ముఠాలతో తస్మాత్‌ జాగ్రత్త అంటున్నారు అనంత పోలీసులు. 

మోసపోయిన కొందరు..
శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం నుంచి ఉన్నత చదువుల నిమిత్తం నగరానికి వచ్చిన ఓ యువకుడు వలపుల వలలో చిక్కుకున్న వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న ఆ యువకుడు..  రాత్రి వేళ పోర్న్‌ వెబ్‌సైట్‌ను చూస్తుండగా అతని వాట్సాప్‌కు ఓ వీడియో వచ్చింది. తీరా చూస్తే అందులో తాను చూస్తున్న వీడియోలో అమ్మాయితో తాను ఉన్నట్లుగా ఉంది. అవాక్కైన అతను తేరుకునేలోపు అవతలి నుంచి మరో సందేశం వచ్చింది.

తాము కోరిన మేరకు డబ్బు చెల్లించాలని లేకపోతే ఆ వీడియోను వెబ్‌సైట్‌లో పెడతామంటూ బెదిరిస్తున్నట్లుగా మెసేజ్‌ చేశారు. దీంతో తన చదువుల కోసం దాచుకున్న డబ్బు కాస్త బ్లాక్‌మెయిలర్‌ చెప్పిన ఖాతాకు జమ చేశాడు. ఇంతటితో విషయాన్ని ఆపలేదు. తరచూ డబ్బు కోసం వేధిస్తుండడంతో విషయాన్ని తన మిత్రుల ద్వారా తండ్రికి చేరవేశాడు. తల్లిదండ్రులు ఆ యువకుడిని మందలించి ఫోన్‌లో బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న వారిని గట్టిగా హెచ్చరించడంతో వివాదం సద్దుమణిగింది. కాగా, అప్పటికే ఆ యువకుడు రూ.వేలల్లో బ్లాక్‌మెయిలర్‌కు నగదు బదిలీ చేశాడు.

జిల్లా కేంద్రానికి చెందిన ఓ సంఘం నాయకుడి మొబైల్‌కు రాత్రి 10 గంటల సమయంలో హాయ్‌ ఎలా ఉన్నారంటూ ఓ మెస్సేజ్‌ వచ్చింది. తెలిసిన వారేమోనని అతను స్పందించాడు. నిమిషాల వ్యవధిలో అతనికి వీడియో ఫోన్‌ కాల్‌ వచ్చింది. తీసి చూస్తే న్యూడ్‌గా ఓ యువతి దర్శనమిచ్చింది. మొదట భయపడిన ఆయన కొద్ది క్షణాల పాటు ఆ అమ్మాయి ఎవరోనని చూసి ఫోన్‌ కట్‌ చేశాడు. ఇక రాత్రంతా ఒకటే గోల మేము పంపిన నంబరుకు ఫోన్‌పే ద్వారా మీరు డబ్బు పంపక పోతే మీ పరువు తీస్తామంటూ బెదిరింపులకు దిగారు.

నేనేం తప్పు చేశానో? చెప్పమంటూ వారితో అతను వాదించాడు. అదే సమయంలో స్క్రీన్‌ రికార్డు చేసిన చిన్న వీడియో క్లిప్‌ను బ్లాక్‌మెయిలర్‌ పంపాడు. అందులో ఆ అమ్మాయి న్యూడ్‌గా ఉన్న వీడియోను తాను చూస్తున్నట్లుగా ఉంది. ఈ వీడియోని మీ ఫేస్‌బుక్‌లో ఉన్న మిత్రులు, పొలిటికల్‌ లీడర్లకు పంపుతామని బెదిరించారు. ఏం  చేయాలో పాలుపోక తెలిసిన పోలీసు మిత్రుడికి చెప్పి ఆయనతో ఫోన్‌లో బ్లాక్‌ మెయిలర్‌ని హెచ్చరికలు జారి చేయించి బయటపడ్డాడు. కాకపోతే అప్పటికే ఆ నేత రూ.18 వేలు ఫోన్‌ఫే ద్వారా బ్లాక్‌మెయిలర్‌కు బదిలీ చేయడం గమనార్హం.

రోజుకో రూపంలో మోసాలు 
సైబర్‌ నేరగాళ్లు రోజుకో రూపంలో మోసాలకు తెగబడుతున్నారు. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత సమాచారాన్ని సోషల్‌ మీడియాలో ఉంచకూడదు. సెల్‌ఫోన్‌లో చిన్నపాటి ప్రైవసీ సెట్టింగ్‌ చేసుకుంటే చాలా మంచిది. ప్రధానంగా ఫేస్‌బుక్‌ హ్యాక్, వాట్సాప్, మెస్సేంజర్, వీడియో కాల్స్‌ ద్వారా ఆకర్శించి దోపిడీ చేస్తున్నారు. కొత్త వ్యక్తుల నుంచి వీడియోకాల్స్, సందేశాలకు స్పందించకపోతే సురక్షితంగా ఉన్నట్లే. కాదని ఆకర్శితులైతే బ్లాక్‌మెయిలర్స్‌ వలలో పడక తప్పదు. కొత్త వ్యక్తులు పంపే సందేశాలు, లింకులను అసలు ఓపెన్‌ చేయవద్దు. ఒకవేళ ఇలాంటి ఉచ్చులో పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.  
– డాక్టర్‌ ఫక్కీరప్ప, ఎస్పీ, అనంతపురం 

Advertisement
 
Advertisement
 
Advertisement