‘జేఈఈ పరీక్ష’ అక్రమాలపై సీబీఐ కేసు

CBI books institute, its directors for irregularities in JEE MAINS - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (జేఈఈ–మెయిన్స్‌)–2021 పరీక్ష నిర్వహణకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఎఫినిటీ ఎడ్యుకేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) బుధవారం కేసు నమోదుచేసింది. ఆ సంస్థ డైరెక్టర్లు సిద్దార్థ్‌ కృష్ణ, విశ్వంభర్‌ మణి త్రిపాఠి, గోవింద్‌ వర్షిణి, ముగ్గురు ఉద్యోగులు, అక్రమాల్లో లబ్ది పొందారని భావిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసింది. ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎన్‌ఐటీ)ల్లో సీటు కావాలనుకునే అభ్యర్థులు ఒక్కొక్కరి నుంచి రూ.12–15 లక్షలు తీసుకునేలా నిందితులు ఒప్పందం కుదుర్చుకున్నారు. హరియాణాలోని సోనీపట్‌లో ముందే ఎంపిక చేసిన జేఈఈ (మెయిన్స్‌) ఎగ్జామ్‌ సెంటర్‌లోనే పరీక్ష రాస్తున్న విద్యార్థుల క్వశ్చన్‌ పేపర్లలోని ప్రశ్నలకు రిమోట్‌ యాక్సెస్‌ ద్వారా వేరే చోటు నుంచి జవాబులు అందిస్తారు.

ఇలా డబ్బులు ముట్టజెప్పే అభ్యర్థులు ఎన్‌ఐటీల్లో సీటు సాధించేలా పథక రచన చేశారు. ఒప్పందంలో భాగంగా ఆయా అభ్యర్థుల నుంచి పూచీకత్తుగా వారి పది, 12వ తరగతి మార్కుల సర్టిఫికెట్లు, వారి పాస్‌వర్డ్‌లు, సీటు దక్కితే తర్వాత నగదుగా మార్చుకునేలా ‘పోస్ట్‌ డేటెడ్‌’ చెక్‌లు నిందితులు ముందే తీసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా గురువారం ఆరు రాష్ట్రాల్లో సంస్థకు సంబంధించిన 19 వేర్వేరు ప్రాంతాల్లో తమ అధికారులు సోదాలు నిర్వహించారని సీబీఐ అధికార ప్రతినిధి ఆర్‌సీ జోషి చెప్పారు. ఢిల్లీ, ఇండోర్, పుణె, బెంగళూరు, జంషెడ్‌పూర్‌లలోనూ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో 25 ల్యాప్‌టాప్‌లు, 7 పర్సనల్‌ కంప్యూటర్లు, 30 చెక్‌లు, డిగ్రీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నట్లు జోషి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఈఈ(మెయిన్స్‌) నిర్వహిస్తారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top