బీజేపీ నేత కాల్చివేత : తీవ్ర ఉద్రిక్తత | BJP MPs aide shot dead party blames Trinamool | Sakshi
Sakshi News home page

బీజేపీ నేత కాల్చివేత : తీవ్ర ఉద్రిక్తత

Oct 5 2020 8:20 AM | Updated on Oct 5 2020 1:06 PM

BJP MPs aide shot dead party blames Trinamool - Sakshi

సాక్షి, కోలకతా : పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ముఖ్య అనుచరుడు, టిటాగర్ మునిసిపాలిటీ కౌన్సిలర్ మనీష్ శుక్లా దారుణ హత్యకు గురయ్యారు. పోలీస్ స్టేషన్ సమీపంలో దుండగులు అతి సమీపం నుంచి అతనిపై కాల్పులు జరిపి హతమార్చారు. ఈ హత్యకు నిరసనగా బీజేపీ మద్దతుదారులు పోలీస్ స్టేషన్ వెలుపల ఆందోళనకు దిగారు.  ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.  

పార్టీ నాయకులతో సమావేశం అనంతరం ఆదివారం రాత్రి కార్యకర్తలతో మాట్లాడుతుండగా ముసుగులు ధరించిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు శుక్లాపై అతి సమీపంనుంచి కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆయన కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలొదిలారు. శుక్లాతోపాటు మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహోదగ్రులైన  కార్యకర్తలు ఆందోళనకు దిగారు.  పరిస్థితి అదుపుతప్పడంతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారి మనోజ్ వర్మ పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనపై బీజేపీ 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది.

తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసీ) ఈ దాడికి పాల్పడిందని ఎంపీ అర్జున్ సింగ్ ఆరోపించారు. రాత్రి 7.30 వరకు తనతో ఉన్నారని, పోలీసుల సమక్షంలోనే శుక్లాపై కాల్పులు జరిగాయని విమర్శించారు. మరోవైపు గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, డీజీపీని వీరేంద్రను రాజ్ భవన్‌కు పిలిపించారు. మనీష్ తనకు తమ్ముడి లాంటి వాడని, బెంగాల్ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి టీఎంసీ, పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని పోలీసుల పాత్రను దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ ట్విటర్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. అధికార పార్టీ నేరస్థులకు ఆశ్రయం కల్పిస్తోందని మరో సీనియర్ నాయకుడు అరవింద్ మీనన్ ఆరోపించారు. టీఎంసీ కుట్రలతో బహిరంగ  హత్యలకు తెగబడుతోందని  ట్వీట్ చేశారు.

ప్రతిపక్ష బీజేపీ ఆరోపణలను టీఎంసీ తోసిపుచ్చింది. పార్టీలో అంతర్గత పోరుకు శుక్లా హత్య నిదర్శనమంటూ ఖండించారు. తప్పుడు ఆరోపణలతో టీఎంసీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని టీఎంసీ నేత నిర్మల్ ఘోష్ విమర్శలను తిప్పికొట్టారు.  కాగా 2019 లో బీజేపీలో చేరిన మనీష్ శుక్లా ఎంపీ అర్జున్ సింగ్ ప్రధాన అనుచరుడు. శుక్లా  బీజేపీలో చేరడానికి ముందు టీఎంసీతో ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement