బండపై బాదేశారు | - | Sakshi
Sakshi News home page

బండపై బాదేశారు

May 4 2026 7:07 AM | Updated on May 4 2026 7:07 AM

వాణిజ్య సిలిండర్‌పై రూ.990.50 పెంపు రూ.3,266లకు చేరిన వైనం పెరిగిన ఆహార ఉత్పత్తుల ధరలు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): అందరూ ఊహించినట్టే జరిగింది. అమెరికా–ఇరాన్‌ యుద్ధం తొలిదెబ్బ వాణిజ్య సిలిండర్‌పై పడి పరోక్షంగా వినియోగదారులపై పడింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రో ధరలు పెరుగుతాయన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం తొలి పంజా విసిరింది. వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరను ఏకంగా రూ.990.50 పెంచింది. దీంతో రూ.2,275.50 ఉన్న 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర రూ.3,266లకు చేరింది. ఈ హఠాత్‌ పరిణామంతో చిరు వ్యాపారుల నుంచి హోటల్‌ నిర్వాహకుల వరకు బెంబేలెత్తిపోతున్నారు. పెరిగిన ధరలతో తాము వ్యాపారాలు చేయలేమని ఆహార ఉత్పత్తులు తయారు చేసే వారు వాపోతున్నారు. సహజంగానే తమ వంటకాలకు, ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించడం లేదని, ఈ సమయంలో రూ.వెయ్యి పెంచితే ఇక లాభాలేం వస్తాయని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. సిలిండర్‌ ధరల పెంపుతో ఇటు చిరు హోటళ్లు, రెస్టారెంట్లలోనూ తయారు చేసే అల్పాహారం, బిర్యానీ, భోజనాల ధరలు పెరిగాయి. ఈ భారం పరోక్షంగా వినియోగదారులపై పడింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై అన్ని వర్గాల వారు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో గృహ అవసరాల గ్యాస్‌ ధర రూ.50 పెంచిన విషయం తెలిసిందే. వీటి ధరలు సైతం మరోసారి పెరుగుతాయనే ప్రచారంతో సామాన్యుల గుండెల్లో గుబులు రేపుతోంది.

కొనసాగుతున్న కొరత

అమెరికా–ఇరాన్‌ యుద్ధం మొదలైన నాటి నుంచి వాణిజ్య ఆవసరాల గ్యాస్‌ సిలిండర్లు దొరకడం లేదు. దీనికి తీవ్ర కొరత నెలకొంది. ఆ మధ్య వా రం రోజుల పాటు గృహ అవసరాలకు సంబంధించిన గ్యాస్‌ సిలిండర్లకు డిమాండ్‌ ఏర్పడిన తరువాత పరిస్థితి సద్దు మునిగింది. కానీ వాణిజ్య అవసరాల గ్యాస్‌ దొరకడం లేదు. ఇప్పటికే దీనిని బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. నిన్న, మొన్నటి వరకు వాణిజ్య అవసరాల గ్యాస్‌ ధర రూ.2,275.50 ఉండగా బ్లాక్‌లో రూ.3 వేలకు విక్రయిస్తున్న విషయం తెలిసిందే. తాజా పెంపుతో గ్యాస్‌ ఏజెన్సీల వద్దే సిలిండర్‌ ధర రూ.3,266లకు చేరింది. ధర పెరిగినా తగిన సరఫరా లేకపోవడంతో బ్లాక్‌లో కొనుగోలు చేయాల్సి రావడంతో మరింత భారం పడుతుందని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు వాపోతున్నారు.

నల్ల బజారుకు మరింతగా..

జిల్లాలో వాణిజ్య అవసరాలకు సంబంధించి 4 వేల కనెక్షన్లు ఉన్నట్టు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా జిల్లాలో తోపుడు బండ్లు, చిన్నచిన్న హోటళ్ల నుంచి అతిపెద్ద రెస్టారెంట్ల వరకు 15 వేలకు పైగా ఉన్నట్టు అంచనా. వాణిజ్య సిలిండర్లు మాత్రం అందులో పదో వంతు కూడా లేకపోవడం గమనార్హం. ఇందుకు ప్రధాన కారణం నిబంధనలకు విరుద్ధంగా గృహ అవసరాల గ్యాస్‌ సిలిండర్లను వ్యాపారాలకు వినియోగించడమే. ఇప్పుడు గృహ అవసరాల సిలిండర్‌కు, వాణిజ్య సిలిండర్‌కు మధ్య ధర వ్యత్యాసం రూ.2 వేల వరకు ఉంది. ఈ క్రమంలో గృహ అవసరాల గ్యాస్‌ను నిబంధనలకు విరుద్ధంగా వినియోగించనున్నారు. ఈ కారణంగా వాణిజ్య సిలిండర్లను కాదని గృహ అవసరాలకు సంబంధించిన గ్యాస్‌ను నేరుగా వినియోగించనున్నారు. లేదా గృహ అవసరాల గ్యాస్‌ను వాణిజ్య సిలిండర్లలో నింపి వినియోగించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement