‘మొలకెత్తని’ ఆశలు | - | Sakshi
Sakshi News home page

‘మొలకెత్తని’ ఆశలు

Apr 30 2026 7:55 AM | Updated on Apr 30 2026 7:55 AM

● మల్చింగ్‌షీట్ల వేడితోపాటు భారీ ఉష్ణోగ్రత ● ఎండుతున్న టమాట నారుతో తప్పని తిప్పలు

పలమనేరు: పలమనేరు హార్టికల్చర్‌ డివిజన్‌లో ఏటా వేసవిలో టమాట సాగు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా జనవరి నుంచి మే దాకా రైతులు టమాటను సాగు చేస్తుంటారు. ఇప్పటికే రెండువేల హెక్టార్లలో టమాట సాగై పలు దశల్లో ఉంది. గత 15 రోజుల క్రితం నాటిన నారు చేల్లో విపరీతమైన ఎండల కారణంగా మొలకెత్తకుండా ఎండుతోంది. దీంతో డిమాండ్‌ ఉన్న సమయంలో నారు తెచ్చినాటిన రైతులు పంటను చూసి బాధపడుతున్నారు. మరికొందరు ప్రస్తుతం 300 ఎకరాల్లో నారు నాటేందుకు సిద్ధమవుతున్నారు.

నర్సరీల్లో నో టమాట సీడ్స్‌

అధిక ఉష్ణోగ్రతల కారణంగా నర్సరీల్లోనే హైబ్రిడ్‌ రకాల టమాట నారు దొరకడం లేదు. టమాటకు ప్రస్తుతం ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఎలాగైనా టమాట నాటాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇదే సమయంలో టమాటా నారుకు విపరీతంగా డిమాండ్‌ వచ్చిపడింది. 40 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతల కారణంగా టమాట నారు మొలకెత్తేందుకు ఇబ్బందిగా మారింది. ఇప్పట్లో వర్షాలు పడి వాతావరణం చల్లబడితేగానీ నార్లు పోయమని నర్సరీ నిర్వాహకులు చెబుతున్నారు.

అప్పటిదాకా టమాట సాగు వద్దు

ప్రస్తుతం ఎండల కారణంగా మా నర్సరీలోనూ టమాట నారు పోయడం లేదు. అందుకే రైతులకు నారు ఇవ్వడం లేదు. ప్రస్తుతం టమాట నారు నాటిన చోట అధిక ఉష్ణోగ్రత కారణంగా మొక్కలు చనిపోతున్నాయి. దీంతోపాటు మల్చింగ్‌ షీట్లు ఎక్కువగా ఎండను తీసుకుంటున్నాయి. రెండు వైపులా అధిక వేడిమి దీనికి కారణం. అందుకే ఎండలు తగ్గాకే టమాట నాటుకోవడం మేలని రైతులకు సూచిస్తున్నాం. –కోటేశ్వరావు, సైంటిస్ట్‌, ఎక్స్‌లెన్స్‌సెంటర్‌, కుప్పం

Advertisement
 
Advertisement
Advertisement