చిత్తూరు రూరల్ (కాణిపాకం) : అమరావతి కాదు..చంద్రావతి అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ ఆరోపించారు. ఆయన ఆదివారం చిత్తూరు నగరంలోని అంబేడ్కర్ భవనంలో మాలల ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయ న మాట్లాడుతూ మాల, మాదిగలు కలిసి నడవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 2029 నాటికి దళితులు దేశ, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తారని తెలిపారు. ఓబీసీలు కూడా దళితులతో కలిస్తేనే అధికారంలోకి రావచ్చని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎస్సీల సంక్షేమంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. రాజధాని అమరావతిలో పేదలు ఒక్కరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. అక్కడున్నది చంద్ర బాబు అనుయాయులకు చెందిన భూములేన ని పేర్కొన్నారు. తాను తిరుపతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశా రు. కార్యక్రమంలో నాయకులు పరదేశి తదితరులు పాల్గొన్నారు.
పొట్టకూటి కోసం వచ్చి కానరాని లోకాలకు..
బైరెడ్డిపల్లె : పొట్టకూటికోసం వచ్చిన యువకు డు కానరాని లోకాలకు చేరుకున్నాడు. ఎండ వేడిమిని తాళలేక ఈత కు వెళ్లిన యువకుడు బురదలో కూరుకుపోయి మృతిచెందాడు. ఈ సంఘటన ఆదివారం బైరెడ్డిపల్లె పెద్దచెరువులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం రాణీపేటకు చెందిన శ్రీనివాసులు కుమారుడు ఢిల్లీదొరై (25) గంగినాయనపల్లెలో వినాయకస్వామి ఆలయ నిర్మాణ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఎండవేడిమిని భరించలేక స్నేహితులతో కలిసి గంగినాయనపల్లె సమీపంలో ఉన్న బైరెడ్డిపల్లె పెద్దచెరువులో ఈతకు వెళ్లాడు. చెరువులో ఉన్న గుంతలోని బురదలో కూరుకుపోయాడు. ఎంతసేపటికీ అతను బయటకు రాకపోవడంతో స్నేహితులు గ్రామస్తులకు సమాచారం అందించారు. వారు ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో పలమనేరు అగ్నిమాఫక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాఫక సిబ్బంది యోగానాథ్, శివరాజు, పాండు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశా రు. మృతుడి తండ్రి మూడునెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కుటుంబ పోషణ భారం డిగ్రీ చదువుతున్న ఢిల్లీదొరై పడింది. కూలి పనుల కోసం వచ్చి మృత్యువాత పడడంతో తల్లి కన్నీరుమున్నీరైంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
డీఈఈ సెట్‌కు దరఖాస్తులు
చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్మీడియట్ విద్య తో గౌరవ ప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో చేరాలనుకునే విద్యార్థులు డీఈఈ సెట్‌కు దరఖాస్తులు చేసు కోవాలని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ డీఈఈ సెట్ ఉపాఽ ద్యాయ వృత్తికి బంగారుబాట అని తెలిపారు. డీఎడ్ కోర్సు చదివేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులకు డీఈఈ సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పూర్తిచేసిన, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు ఉండాలన్నారు. 17 ఏళ్లు నిండి ఉండాలని, గరిష్ట వయోపరిమితి లేదన్నా రు. పరీక్ష విధానం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ రూపంలో పరీక్ష ఉంటుందని వెల్లడించారు. ఇందులో నెగిటివ్ మార్కుల విధానం లేదన్నా రు. పరీక్ష సమయం 2 గంటలు ఉంటుందని తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాల న్నారు. డీఈఈ సెట్‌లో అర్హత సాధించి డీఎడ్ పూర్తి చేసిన వారు టెట్, డీఎస్‌సీ పరీక్షలు రాసి ప్రభుత్వ టీచర్‌గా స్థిరపడవచ్చని వివరించారు.
మే 12న తిరుపతి గంగ జాతర
తిరుపతి కల్చరల్ : శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతరను మే 12వ తేదీన నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఆయన ఆదివారం గంగమ్మ ఆలయంలో జాతర కరపత్రాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మే 5వ తేదీ రాత్రి చేపట్టే చాటింపుతో అమ్మవారి జాతర ప్రారంభమవుతుందన్నారు. 13వ తేదీ తెల్లవారుజామున అమ్మవారి విశ్వరూపంతో జాతర ముగుస్తుందని వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.


