పెనగలూరు : ప్రజాభిమానమే వైఎస్సార్‌సీపీ బలమని, ఇదే స్ఫూర్తితో జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం పార్టీ రైల్వేకోడూరు నియోజకవర్గ సమన్వయకర్త కొరముట్ల శ్రీనివాసులు, కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు కొండూరు అజయ్‌రెడ్డితో కలిసి పెనగలూరు మండలం ఎన్‌ఆర్‌పురం, పల్లంపాడు గ్రామాల్లో పర్యటించారు. ఆయనకు వందల సంఖ్యలో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చి ఘనంగా స్వాగతం పలికారు. మిథున్‌రెడ్డి మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు. సూపర్ సిక్స్ పథకాల పేరుతో అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. ఇచ్చిన హామీలకంటే అధికంగా అమలు చేసిన ఘనత ఒక్క జగనన్నకే దక్కుతుందని కొనియాడారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సంక్షేమం.. అభివృద్ధిని సమపాళ్లలో అందించామని వెల్లడించారు. చంద్రబాబు సర్కారు కేవలం మాటలకే పరిమితమవుతోందని, ఊకదంపుడు ఉపన్యాసాలతో నెట్టుకొస్తోందని విమర్శించారు. ఇకపై ప్రజలు చంద్రబాబు మాయమాటలను నమ్మే ప్రసక్తే లేదన్నారు. వైఎస్సార్‌సీపీకే పట్టం కడతారని స్పష్టం చేశారు. అనంతరం పల్లమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.


