మఫ్టీలో మనుషులను ఎత్తుకెళ్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అణచివేయాలని చూస్తున్నారు ఇదీ రెండేళ్ల చంద్రబాబు పాలన మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం
కార్వేటినగరం: చంద్రబాబు పాలనలో పోలీసుల తీరు ప్రమాదకరంగా మారిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. దీన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఆయన ఆదివారం జిల్లా పార్టీ కన్వీనర్ భూమన కరుణాకరరెడ్డితో కలసి పుత్తూరులోని మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి ఇంటికి వచ్చారు. వారికి గంగాధరనెల్లూరు నియోజకవర్గం నుంచి నియోజకవర్గ సమన్వయకర్త కళత్తూరు కృపాలక్ష్మి ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయకత్వంలోని పోలీసులు మఫ్టీలో వచ్చి మనుషులను ఎత్తుకెళ్లిపోతున్నారని ఆరోపించారు. తన విషయంలోనూ అక్రమంగా 18 రోజుల పాటు రిమాండ్‌లో పెట్టించారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చంపేస్తా అన్న పెమ్మసాని మాటకి కౌంటర్‌గా సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన తమ్మిరెడ్డి అనే వ్యక్తిపై లాలాపేటలో కేసు నమోదు చేశారన్నారు. ఆపై పోలీసులు మఫ్టీలో 30వ తేదీ అతన్ని తీసుకెళ్లి 2వ తేదీ కోర్టులో హాజరుపరిచారన్నారు. ఆంధ్రజ్యోతి, టీవీ–5 ఎంతదారుణంగా వ్యవహరిస్తున్నాయంటే చెప్పలేక పోతున్నామన్నారు. ఏబీఎన్ వీకెన్డ్‌లో మహిళలను దుర్భాషలాడితే దాన్ని ఖండించాల్సింది పోయి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం దాన్ని సమర్ధించేలా మాట్లాడడం తనను బాధించిందన్నారు.
చంద్రబాబును జనసేన నాయకులు నిలదీయాలి
పవన్‌కళ్యాణ్ అండతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కాపు కులాన్ని సైతం మోసం చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా కాపు కార్పొరేషన్‌కు ఎందుకు నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు. కాపులకు ఒక్క లోను ఇచ్చారా..? అని ప్రశ్నించారు. జీడీ నెల్లూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న సమన్వయకర్త కళత్తూరు కృపాలక్ష్మిని మీ బిడ్డగా ఆశీర్వదించాలని కోరారు.


