అమ్మవారి సన్నిధిలో.. పోలీసుల అకృత్యం! | - | Sakshi
Sakshi News home page

అమ్మవారి సన్నిధిలో.. పోలీసుల అకృత్యం!

Apr 13 2026 7:26 AM | Updated on Apr 13 2026 7:26 AM

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: అమ్మవారి సన్నిధిలో.. పోలీసులు అకృత్యానికి పాల్పడ్డారు. జిల్లా ఎస్పీ ఆదేశించారు.. తిరుచానూరు పోలీసు లు ఆచరించారు. నడి రోడ్డుపై ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన చిన్నపాటి గొడవకు రాజకీయ రంగు పులిమి వైఎస్‌ఆర్‌ సీపీకి చెందిన మాజీ సర్పంచ్‌ వర్గీయులపై అక్రమ కేసులు పెట్టారు. ఉద్దేశపూర్వకంగా నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేసి బలవంతంగా అరెస్టు చేశారు.

వేలంపాట కోసమే ఇదంతా..

తిరుచానూరు పంచాయతీకి చెందిన ప్రైవేటు టూరిస్టు బస్టాండుకు పంచాయతీ అధికారులు సోమవారం వేలం పాట నిర్వహించనున్నారు. ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తిరుచానూరు సీఐ సునీల్‌కుమార్‌ తిరుచానూరు తాజా మాజీ సర్పంచ్‌ రామచంద్రారెడ్డితో పాటు అతని సోదరుడు ఎంపీటీసీ నరేష్‌రెడ్డికి ముందుగానే టెండరు ప్రక్రియలో పాల్గొనరాదని హుకుం జారీ చేసినట్టు సమాచారం. అందుకు వారు అంగీకరించలేదు. ఈ క్రమంలో శనివారం రాత్రి అనుకోకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవలో వీరందరినీ ఇరికించే పనులను చకచకా పూర్తి చేసేశారు. అక్రమంగా కేసులు పెట్టడమే కాక వారిని పోలీస్‌ స్టేషన్‌లో నిర్భందించి విచక్షణా రహితంగా కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయినా సరే తిరుచానూరు పోలీసులు లెక్క చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.

గత ఏడాది కూడా ఇదే తంతు

గత ఏడాది మార్చి 24వ తేదీన పంచాయతీ టూరిస్టు బస్టాండు వేలం ప్రక్రియ జరిగింది. అప్పుడు కూడా పోలీసులు, టీడీపీ నాయకులతో చేతులు కలిపి ఇలాగే ప్రత్యర్థులను లోపలకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. తిరుచానూరు పంచాయతీతో సంబంధం లేని టీడీపీ నేతలంతా అక్కడకు చేరుకుని అప్పటి సర్పంచ్‌ రామచంద్రారెడ్డి వర్గీయులు ఎవ్వరినీ లోపలకు వెళ్లకుండా టెండరు ఫారాలను చించివేసి నానా హంగామా చేస్తున్నా పోలీసులు చూస్తుండి పోయారు. అప్పుడు సర్పంచ్‌గా పదవిలో వున్న రామచంద్రారెడ్డి తన వర్గీయులను వేలం ప్రక్రియలో పాల్గొనేలా చేశారు. దీంతో అంతకుముందు కంటే రూ.61.94 లక్షలు అధికంగా పాడి పంచాయతీకి ఆదాయాన్ని తెచ్చిపెట్టారు. ఇప్పుడు ఏకంగా పోలీసులే రంగంలోకి దిగి వేలం ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉన్న వారందరినీ అక్రమ కేసులో ఇరికించి తమ ఆధీనంలోకి తీసుకోవడం అమానుషం.

Advertisement
 
Advertisement
Advertisement