● అధికార పార్టీ అండతో తప్పుడు పత్రాల సృష్టి ● ఉద్యోగాలు ఊడగొట్టేలా ఉద్యమిస్తాం ● హిందూ చైతన్య వేదిక సభ్యుల హెచ్చరిక
చిత్తూరు రూరల్ (కాణిపాకం): అధికార పార్టీ అండ ఉందని ఇద్దరు వ్యక్తులు సత్యమ్మ సొత్తునే కాజేశారని హిందూ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు రామమూర్తి ఆరోపించారు. వారి ఉద్యోగాలు ఊడగొట్టేలా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఆయన శనివారం చిత్తూరులోని ఆ సంఘం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జీడీనెల్లూరు మండలం పాతవెంకటాపురం గ్రామంలో 2.39 ఎకరాల ఇనాం భూములు ఉన్నాయని తెలిపారు. అందులో సత్యమ్మ ఆలయాన్ని నిర్మించాలని స్థానికులు నిర్ణయించారని తెలిపారు. ఇద్దరు వ్యక్తులు ఆలయ నిర్మాణాన్ని అడ్డుకుని భూ ఆక్రమణకు పాల్పడ్డారని ఆరోపించారు. వారు అక్రమంగా పట్టా పొంది ఆ భూమిలో సత్యమ్మ అమ్మవారి ఆలయాన్ని కూల్చివేశారని ఆరోపించారు. ప్రశ్నించిన గ్రామస్తులపై దౌర్జన్యం చేయడం దారుణమని వాపోయారు. అధికార పార్టీ అండతో తప్పుడు పత్రాలు సృష్టించిన ఉద్యోగుల ఉద్యోగాలు ఊడేలా ఉద్యమిస్తామన్నారు. ఈ విషయాన్ని సోమవారం చిత్తూరు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. సమావేశంలో గ్రామస్తులు సుబ్రమణ్యం, నటరాజన్, కన్నయ్య, కృష్ణయ్య, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.


