ఎలాంటి సుంకం చెల్లించకుండా
అక్రమంగా వాడకం
నకిలీ బిల్లులు సృష్టించి తరలింపు
నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్న అధికారులు
ప్రభుత్వ ఖజానాకు భారీ గండి
నిఘా ఏదీ?
డీజిల్ స్మగ్లింగ్‌లో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వాణిజ్య పన్నులు, పోలీసు శాఖలపై ఈ స్మగ్లింగ్ అరికట్టాల్సిన బాధ్యత ఉంది. ఎప్పుడో మూడు నెలలకోసారి రెండు లారీల డీజిల్‌ను సీజ్ చేసి అపరాధ రుసుము కట్టించే వాణిజ్య పన్నులశాఖలోని నిఘా వ్యవస్థ బలహీనంగా ఉంది. ఇక పోలీసుశాఖలో నెలవారి మామూళ్లు తీసుకునే ఒకరిద్దరు అధికారులు అక్రమార్కులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చిత్తూరులో అధికారులు సీజ్ చేసిన కర్ణాటక డీజిల్
చిత్తూరు అర్బన్: జిల్లాలో జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ హైవేలు, అంతర్రాష్ట్ర జాతీయ రహదారుల పనులు ఓవైపు.. గ్రానైట్ పరిశ్రమలు, ఇతర మధ్య–భారీ పరిశ్రమల్లో పనులు ఇంకో వైపు జరుగుతున్నాయి. ఈ పనుల కోసం రోజూ వందల సంఖ్యలో భారీ వాహనాలు తిరుగుతున్నాయి. ఇసుక నుంచి కంకర వరకు, గ్రానైట్ నుంచి ముడిసరుకు రవాణాకు భారీ వాహనాలు తప్పనిసరి. వాహనాలతో పాటు ఫ్యాక్టరీలకు కావాల్సిన ఇంధనం అక్రమ మార్గంలో సరిహద్దులు దాటి జిల్లాలోకి వస్తోంది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లల్లో గండిపడుతోంది.
– ఈనెల 6న కర్ణాటక నుంచి చిత్తూరుకు ఓ మినీ వ్యాను వస్తోంది. నంగిలి వద్ద విధుల్లో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వాహనాన్ని తనిఖీ చేశారు. ఎలాంటి బిల్లులు లేకుండా రూ.1.8 లక్షల విలువైన 1,800 లీటర్ల డీజిల్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
.. ఇది ఒక్క ఆరో తేదీనే కాదు. నిత్యం జిల్లాలోకి సరిహద్దు రాష్ట్రాల నుంచి దొంగచాటుగా డీజిల్ తీసుకొచ్చి విక్రయాలు సాగిస్తున్నారు. అధికార పలుకబడి ఉపయోగించి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. దీనిపై నిఘా ఉంచాల్సిన అధికారులు తమకెందుకులే అన్న ధోరణితో నిర్లక్ష్యంగా ఉండిపోతున్నారు.
ధరలో వ్యత్యాసం
చిత్తూరు జిల్లాలో లీటరు డీజిల్ అన్ని పన్నులు కలుపుకుని రూ.98.16 ఉండగా.. కర్ణాటకలోని కోలార్‌లో రూ.91.21 ఉంది. రాష్ట్రాల్లో ఎకై ్సజ్ సుంకం కారణంగా ఈ వ్యత్యాసం ఉంది. అంటే లీటరుకు రూ.7 వరకు కర్ణాటకలో తక్కువ. దీన్ని ఏపీలోకి తీసుకొస్తే సుంకం చెల్లించాలి. అపుడు అది కూడా రూ.వంద దాటుతుంది. కానీ కొందరు స్మగ్లర్లు నకిలీ బిల్లులు సృష్టించి రోజుకు డ్రమ్ముల్లో, లారీల కొద్దీ డీజిల్‌ను సరిహద్దులు దాటించి జిల్లాలోకి తీసుకొస్తున్నారు. ఒక్కో లారీలో 10 వేల లీటర్ల చొప్పున రోజుకు 50 వరకు లారీలు అధికారుల కళ్లుగప్పి జిల్లాలోకి వస్తున్నాయి. దీనికితోడు డీజిల్‌లో ఇతర నూనెలను మిక్స్ చేసి కల్తీ చేస్తున్నారు. ఫలితంగా వీటిని వాహనాలకు పోయడం ద్వారా వాయు కాలుష్యం శాతం కూడా విపరీతంగా పెరిగిపోతోంది. అధికారుల తనిఖీల్లో ఇవి పట్టుబడితే రెట్టింపు మొత్తం అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 10 వేల లీటర్లు తెచ్చినందుకు ఒక్కో లారీ రూ.2 లక్షల వరకు అపరాధ రుసుము చెల్లించాలి. మరోవైపు తమిళనాడు నుంచి కూడా కొద్ది మొత్తంలో డీజిల్ జిల్లాలోకి అక్రమంగా తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ డీజిల్ కారణంగా నెలకు రూ.కోట్లల్లో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతోంది.
చిత్తూరు–పలమనేరు కేంద్రంగా
కర్ణాటక నుంచి వచ్చే డీజిల్ కోలార్ మీదుగా నంగిలి చెక్‌పోస్టు దాటుకుని జిల్లాలోకి వస్తోంది. ఇందులో పెద్ద మొత్తంలో డీజిల్ చిత్తూరుకు వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. చిత్తూరు నగర శివారుల్లోని పలు గ్రానైట్ ఫ్యాక్టరీలు అక్రమంగా డీజిల్ స్మగ్లింగ్ చేస్తున్నాయి. ఇక పశ్చిమ మండలాల్లోని ఫ్యాక్టరీలకు పలమనేరును డీజిల్ డంపింగ్ కేంద్రంగా మార్చుకుంటున్నారు. రోజుకు దాదాపు 20 వేల లీటర్ల వరకు డీజిల్ అక్రమ మార్గాల్లో జిల్లాలోకి చేరుతున్నట్లు సమాచారం. కొందరు బడా వ్యక్తులు వారికున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి కొన్ని టిప్పర్లకు కర్ణాటక నుంచి డీజిల్ తెప్పించి వాడుతున్నారు. దీంతో ప్రభుత్వం ఆదాయం కోల్పోతోంది. ప్రధానంగా కోలార్–పలమనేరు, నంగిలి–చిత్తూరు, చిత్తూరు–గుడియాత్తం, చిత్తూరు–పొన్నై, చిత్తూరు–కాట్పాడి మార్గాల నుంచి డీజిల్‌ను తీసుకొచ్చి జిల్లాలోకి డంప్ చేస్తున్నారు.
కర్ణాటక నుంచి జిల్లాలోకి భారీగా డీజిల్ దిగుమతి


