ఆల్‌రౌండర్‌ దొంగలు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఆల్‌రౌండర్‌ దొంగలు అరెస్ట్‌

Apr 11 2026 8:10 AM | Updated on Apr 11 2026 8:10 AM

● రూ.12 లక్షల విలువజేసే బంగారు,

వెండి స్వాధీనం

పలమనేరు: నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను క్రైమ్‌పార్టీ పోలీసులు, వీకోట పోలీసులు అత్యంత చాకచక్యంగా వీకోట మండలంలోని తమిళనాడు సరిహద్దు నాయకనేరి వద్ద శుక్రవారం అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ.12 లక్షల విలువజేసే బంగారు, వెండి, దేవతా విగ్రహాలు, పొట్టేళ్లు, ద్విచక్ర వాహనాలు, ఓ కారును రికవరీ చేశారు. ముద్దాయిలను రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్‌ స్థానిక పోలీసుస్టేషన్‌లో శుక్రవారం విలేకరులకు వివరించారు.

వీకోట మండలంలో వరుస చోరీలు

నియోజకవర్గంలోని వీకోట మండలంలో ఇటీవల తాళాలు వేసిన ఇళ్లు, దేవాలయాల్లో పంచలోహ విగ్రహాలు, పొట్టేళ్లు, బైక్‌ల వరసు దొంగతనాలు జరిగాయి. దీనిపై జిల్లా ఎస్పీ తుషార్‌ డూడి ఆదేశాలతో డీఎస్పీ ఉత్తర్వు మేరకు వీకోట సీఐ సోమశేఖర్‌, క్రైమ్‌ సిబ్బందితో కలిసి రెండు టీమ్‌లు ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో వీకోట సమీపంలోని నాయకనేరి చెక్‌పోస్టు వద్ద దొంగలను పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో కర్ణాటక రాష్ట్రం, బంగారుపేట తాలూకా, చిన్నకోటేకు చెందిన ఆర్‌.రాజేంద్ర అలియాస్‌ రాజన్న(57), వీకోట మండలం చిన్నాగేపల్లికి చెందిన మురుగ అలియాస్‌ కాశి(34), కర్ణాటకలోని కేజీఎఫ్‌కు సమీపంలోని గిడ్డేగౌడనహళ్లికి చెందిన కన్నన్‌(51), రామకుప్పం మండలం, బందార్లపల్లికి చెందిన రాజశేఖర్‌(29)లున్నారు.

అందరూ స్పెషలిస్ట్‌ దొంగలే

రాజేంద్రపై కర్ణాటకలోని విద్యారణ్యపుర, కొడిగేహళ్లి, బసవేశ్వరనగర, మడివాల, ముళబాగిళ్లలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసి చోరీ చేసేవాడు. పొట్టేళ్లుకూడా పట్టుకెళ్లేవాడు. ఇలా ఇతనిపై 50 పాత కేసులున్నాయి. తాజాగా వీకోట మండలంలో ఐదు కేసులు, పలమనేరు మండలం నక్కపల్లిలో తాళం వేసిన ఇంట్లో జరిగిన చోరీలో ప్రమేయం ఉంది. ఇక మురుగపై సెల్‌ఫోన్ల చోరీలు, బైక్‌చోరీలు, ఆలయాల్లో విగ్రహాల చోరీల్లో స్పెషలిస్ట్‌గా ఉంటూ ఇతనిపై నాలుగు కేసులున్నాయి. కన్నన్‌ పొటేళ్ల దొంగగా ఇతనిపై నాలుగు కేసులున్నాయి. రాజశేఖర్‌ ఇళ్లలో, గుళ్లలో దొంగతానాలు చేస్తుంటాడు. ఇతనిపై వీకోట మండలంలో రెండు కేసులున్నాయి.

అందరూ కలిసికట్టుగా..

వీరందరూ కలిసి అన్నిరకాల చోరీలను ఓ పద్ధతిలో చేయడం వీరి ప్రత్యేకత. వేలిముద్రలు దొరక్కుండా చేతులకు తొడుగులు, ఫోన్లు వాడకుండా, సెల్‌ టవర్‌ లోకేషన్లు లేనిచోటే చోరీలకు పాల్పడుతుంటారు. పక్కాగా రెక్కీ చేసి తమ వద్దనున్న కారులో స్పాట్‌కు వెళ్లి దర్జాగా చోరీలు చేయడం వీరి ప్రత్యేకత. ఈ కేసును త్వరిత గతిన ఛేదించిన వీకోట సీఐ, క్రైమ్‌ పార్టీని డీఎస్పీ అభినందించారు. వీరికి రివార్డు కోసం ఎస్పీకి సిఫారస్తు చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పలమనేరు సీఐ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

పోలీసులు రికవరీ చేసుకున్న ఆభరణాలు

మాట్లాడుతున్న డీఎస్పీ డేగల ప్రభాకర్‌

Advertisement
 
Advertisement
Advertisement