చిత్తూరు కలెక్టరేట్ : సరిహద్దుల కొలతలే కాదు, ప్రాణాలను కాపాడ ఛిజలోనూ తాము ముందుంటామని గ్రామ సచివాలయ సర్వేయర్లు చాటిచెప్పారు. జాతీయ సర్వే దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా రెవెన్యూ భవనంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రక్తదానం చేసిన సర్వేయర్లను అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో రక్త నిల్వల కొరత ఉందన్నారు. అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేందుకు ఇటువంటి శిబిరాలు ఎంతో దోహదపడతాయని చెప్పారు. జాతీయ సర్వే దినోత్సవం కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, మంచి ఆశయం కోసం రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ అన్నారు. ఈ శిబిరంలో సర్వే శాఖ డీడీ జయరాజ్, ఏడీ పుల్లయ్య, సర్వే ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు సోమకుమార్‌రెడ్డి, నాయకులు నరేష్ బాబు, వినోద్ కుమార్, షణ్ముగం, ప్రతాప్ రెడ్డి, దీపిక, దేవేంద్రనాయక్, పరిమళ, నరసింహులు, భవ్య, యుగంధర్, ప్రకాష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


