డ్వామా పీడీ ఫైర్‌ | - | Sakshi
Sakshi News home page

డ్వామా పీడీ ఫైర్‌

Apr 11 2026 8:10 AM | Updated on Apr 11 2026 8:10 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): ఉపాధి పనులు కల్పించడంలో చిత్తూరు మండలం అధ్వాన్నంగా ఉందంటూ డ్వామా పీడీ రవికుమార్‌ ఉపాధి హామీ సిబ్బందిపై మండిపడ్డారు. చిత్తూరులోని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ఉపాధి హామీ బహిరంగ సభ నిర్వహించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మండలంలో మొత్తం ఉపాధి హామీ కింద 583 పనులు, పంచాయతీరాజ్‌ కింద 71 పనులు.. ఇలా మండలంలో 654 పనులు చేపట్టి రూ.5.7 కోట్లు వ్యయం చేశారు. వీటిపై వారం రోజులుగా మండలంలో సామాజిక తనిఖీ బృందం తనిఖీలు చేపట్టింది. జరిగిన అవినీతిని కాసింత బయటకు చూపింది. కొండంత దాచిపెట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి. బహిరంగ సభలో నిబంధనలు ఉల్లంఘించిన ఫీల్డ్‌ అసిస్టెంట్లకు రూ.14,165, క్వాలిటీ కంట్రోల్‌ కింద రూ.19,803 జరిమానా విధించారు. నిబంధనలు పాటించని రైతులకు నోటీసులు జారీచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పీడీ ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యంపై మండిపడ్డారు. లక్ష్యం మేరకు పనులు కల్పించకుంటే ఎలా అంటూ ప్రశ్నించారు.

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

బైరెడ్డిపల్లె: వ్యవసాయ పొలం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌ కొట్టడంతో మండలంలోని తీర్థం గడ్డూరు గ్రామానికి చెందిన కిట్టప్ప (45) అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తుల కథనం.. కిట్టప్ప వ్యవసాయ పొలం వద్ద బోరు మరమ్మతు పనులు చేస్తుండగా ప్రమాదవశా త్తు విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక రైతులు గమనించి విషయం కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలియజేశారు. కిట్టప్ప భార్య మూడు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు చంద్రశేఖర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బైరెడ్డిపల్లె పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement