మహిళా యూనివర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

మహిళా యూనివర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు

Apr 10 2026 9:51 AM | Updated on Apr 10 2026 9:51 AM

క్లుప్తంగా

తిరుపతి రూరల్‌: శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ (ఐఎస్‌ఓ) గుర్తింపును సాధించి, మరో కీలక మైలురాయిని చేరుకుంది. నాణ్యమైన విద్య, సమర్థవంతమైన పరిపాలన, నిరంతర అభివృద్ధిపై వర్సిటీ కట్టుబాటుకు ఈ సర్టిఫికేషన్‌ నిదర్శనంగా నిలిచిందని వీసీ ఆచార్య ఉమ అనందం వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల సమష్టి కృషికి ప్రతిఫలమని తెలిపారు. రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఆర్‌. ఉష మాట్లాడుతూ విద్య, పరిపాలనా వ్యవస్థల్లో నాణ్యత, పారదర్శకతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. హెచ్‌వైఎం ఇంటర్నేషనల్‌ సర్టిఫికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆలపాటి శివయ్య రెండు రోజులుగా యూనివర్సిటీని సందర్శించారు. ఈ ప్రక్రియలో బోధన పద్ధతులు, పరి శోధన, పరిపాలన, మౌలిక వసతులు, విద్యార్థి సేవలు వంటి అన్ని విభాగాలను సమగ్రంగా పరిశీలించి ఆ తరువాత ఽధ్రువీకరణ పత్రాలు అందజేశారు. చివరగా ఐక్వాక్‌ డైరెక్టర్‌ ఆచార్య టి.త్రిపురసుందరి మాట్లాడుతూ వర్సిటీ సాధించిన అంతర్జాతీయ గుర్తింపు కోసం కష్టపడిన అధ్యాపకులు, బోధన, బోధనేతర సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాలకు అరుదైన గుర్తింపు

చంద్రగిరి: శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాలకు అరుదైన గుర్తింపు లభించింది. శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాల జాతీయ సేవా పథకం ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు గత 20 ఏళ్లుగా ఇండియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ బ్లైండ్‌ (ఐఏబీ) అనే స్వచ్ఛంద సంస్థకు విరాళాలు అందిస్తూ వస్తున్నారు. కంటి చూపు లేని ఎందరికో చేయూతను అందించడంలో సహకరిస్తున్న వ్యవసాయ కళాశాల ఉద్యోగులు, విద్యార్థుల సేవా గుణాన్ని గుర్తించి ఐఏబీ బ్లైండ్‌ ఎంపవర్మెంట్‌ చాంపియన్స్‌ –2025 గోల్డ్‌ జోన్‌ అవార్డును సంస్థ నిర్వాహకులు గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా అవార్డును కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ రెడ్డి శేఖర్‌కు అందజేశారు. ఈ గుర్తింపు దక్కడానికి సహకరించిన వ్యవసాయ కళాశాల జాతీయ సేవా పథకం అధికారులు, శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ ఎం.రెడ్డిశేఖర్‌ అభినందించారు. రైతు సంక్షేమానికి సంబంధించిన విద్యను అభ్యసిస్తున్న కళాశాల విద్యార్థులు, జాతీయ సేవా పథకం వలంటీర్లు, జాతీయ సేవా పథకం ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. 2024లోనూ శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాలకు ఐఏబీ బ్లైండ్‌ ఎంపవర్మెంట్‌ చాంపియన్స్‌ గోల్డ్‌ జోన్‌ అవార్డును దక్కిందని వ్యవసాయ కళాశాల అసోసియేటెడ్‌ డాక్టర్‌ ఎం రెడ్డి శేఖర్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం అధికారులు మధుసూదన్‌ రెడ్డి, జ్యోత్స్న, ప్రదీప్‌ కుమార్‌, రాజేష్‌, సబిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement