చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థులు ఎంత ఎదిగినా అమ్మ భాషను, సంప్రదాయాలను ఎప్పటికీ మరువకూడదని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎన్‌పీ, సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన 44వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆ కళాశాలలో నూతనంగా రూ.కోటితో నిర్మించిన బీసీ సంక్షేమ వసతి గృహాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యా వంతురాలైన మహిళ ఒక కుటుంబానికే కాకుండా దేశ భవిష్యత్తుకే వెలుగురేఖ అన్నారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మరువకూడదని చెప్పా రు. తన వ్యక్తిగత జీవితాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీతాను 13 నెలల వయస్సులో ఉన్నప్పుడు అమ్మను కోల్పోయినట్లు చెప్పారు. తన అమ్మమ్మ, తాతయ్యలు చెప్పిన విలువలు, వారు నేర్పిన క్రమశిక్షణే తనను దేశంలో రెండవ అత్యున్నత పదవి అయిన ఉపరాష్ట్రపతి స్థాయికి చేర్చాయన్నారు.
ఆరోగ్యం – జీవనశైలి ముఖ్యం
ప్రస్తుత సమాజంలో 45 ఏళ్లకే అనేక వ్యాధులు రావడంపై ఆయన ఆందోళన కలిగిస్తోందని మాజీ ఉపరాష్ట్రపతి అన్నారు. శ్రీయోగాను జీవితంలో భాగం చేసుకోవాలి, ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలిశ్రీ అని విద్యార్థులకు సూచించారు. రాజకీయాల్లో మహిళలకు త్వరలోనే 33 శాతం రిజర్వేషన్లు అమలులోకి రాబోతున్నాయని చెప్పారు.
యుద్ధాలు వద్దు
ప్రపంచ దేశాల పరిస్థితులపై ఆయన మాట్లాడుతూ భారత్ ఎప్పుడూ ఏ దేశంపైనా దండయాత్ర చేయలేదని, శాంతిని కోరుకునే దేశమని కొనియాడారు. శ్రీప్రస్తుతం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఎవరికీ లాభం లేదని చెప్పారు. కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, ఎమ్మెల్యేలు గురజాల జగన్‌మోహన్, మురళీమోహన్, మాజీ ఎమ్మెల్యే, సీడీపీసీ సెక్రటరీ వెంకటేశ్వర చౌదరి, విజయం విద్యాసంస్థల చైర్మన్ తేజోమూర్తి, అకడమిక్ డైరెక్టర్, పూర్వ విద్యార్థిని శైలజా, ప్రిన్సిపల్ మనోహర్, వైస్ ప్రిన్సిపల్ ఉషారాని పాల్గొన్నారు.


