గైర్హాజరైన పలువురు జిల్లా అధికారులు
అధికారులకు నోటీసులు ఇవ్వాలని
జెడ్పీ చైర్మన్ ఆదేశం
ప్రోటోకాల్‌పై ఎమ్మెల్యే ఆదిమూలం ఫైర్
అధికారుల అక్రమాలపై నిలదీత
సమస్యలపై అధికారులు స్పందించడం లేదన్న సభ్యులు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లా కేంద్రమైన చిత్తూరులోని జెడ్పీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన జెడ్పీ సర్వసభ్య సమావేశం చప్పగా సాగింది. సమావేశాలకు హాజరుకావాలని పలుమార్లు ఆదేశించినా జిల్లా అధికారులు రాలేదు. తమ ప్రాంతా ల సమస్యలను సభలో తెలిపి పరిష్కరించుకుందామనుకున్న ప్రజాప్రతినిధులకు మళ్లీ నిరాశే మిగి లింది. సమావేశాలకు హాజరుకాని అధికారులకు నోటీసులు పంపించాలని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు సీఈవో రవికుమార్‌నాయుడును ఆదేశించారు. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా లో యూరియా కొరత తీవ్రంగా ఉందన్నారు. వచ్చి న స్టాకును కూడా రాజకీయ నాయకులు చెప్పిన వారికి ఇస్తున్నారని ఆరోపించారు. వారు యూరియాను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని విమర్శించారు. యూరియా కొరత లేకుండా చూడా లని ఆదేశించారు. వేరుశనగ విత్తనాలను సరైన సమయానికి రైతులకు అందజేయాలని సూచించారు. ఎమ్మెల్యేల విషయంలో ప్రోటోకాల్ పాటించాలని అధికారులను ఆదేశించారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్నారు. గత ప్రభు త్వం హయాంలో హార్టికల్చర్ ద్వారా మామిడి రైతులకు ఎకరాకు 15 వేల కవర్లు ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు 6 వేల కవర్లే ఎందుకు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇరాన్ యుద్ధం కారణంగా మామిడి గుజ్జు నిల్వలు నిలిచిపోయాయని జ్యూస్ ఫ్యాక్టరీల యజమానులు అంటున్నారని, ఈ ఏడాది కూడా మామి డిని కొనే పరిస్థితి కనిపించడం లేదని వాపోయారు. అలా జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త బోర్లు వేయాలని సూచించారు. వితంతు పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి తీర్మానం పంపుతామన్నారు. వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు నగదు చెల్లించి రెండేళ్లు అవుతున్నా ఎందుకు మంజూరు చేయడం లేదని ట్రాన్స్‌కో అధికారులను నిలదీశారు.
సమస్యలు చెప్పినా పట్టించుకోవడం లేదు
పాలసముద్రం జెడ్పీటీసీ అన్బలగన్ మాట్లాడుతూ యూరియా కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ శరవణ మాట్లాడుతూ కుప్పంలో ప్రోటోకాల్ పాటించడం లేదని, అంటుకట్టు మొక్కలు ఇవ్వడం లేదని తెలి పారు. రామచంద్రాపురం జెడ్పీటీసీ రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన వైద్య సేవలు అందడం లేదన్నారు. ఓపీల సంఖ్య తగ్గిందని, వైద్యుల కొరత తీవ్రంగా ఉందని దుయ్యబట్టారు. సగంలో అగిపోయిన రోడ్డు పనులను పూర్తి చేయాలన్నారు. తిరుపతి రూరల్ ఎంపీపీ మాధవ్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు మంజూరైనా విడుదల చేయడం లేదని ఆరోపించారు. హౌసింగ్ పెండింగ్ బిల్లులు రూ.19 కోట్లు ఉన్నాయని, వాటిని మంజూరు చేయాలన్నారు. జెడ్పీటీసీ సుమన్ మాట్లాడుతూ నారాయణవనంలో ఉపాధి హామీ నిధులతో శ్మశానవాటికకు రోడ్డు వేయాలని, సగంలో ఆగిపోయిన రోడ్ల పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బంగారుపాళ్యం ఎంపీపీ అమరావతి మాట్లాడుతూ మండలంలో వ్యవసాయ, గృహ సర్వీసులకు వేర్వేరుగా ఫీడర్లు ఏర్పాటు చేయా లని తెలిపారు. పీటీఎం జెడ్పీటీసీ శివన్న మాట్లాడుతూ వ్యవసాయ సర్వీసులు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పూతలపట్టు జెడ్పీటీసీ దేవిక మాట్లాడుతూ చోరీకి గురైన ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో రెండేళ్లయినా కొత్త వాటిని ఏర్పాటుచేయలేదని తెలిపారు. కార్యక్రమంలో డీఈర్వో మోహన్‌కుమార్, పలువురు ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, పక్కన డీఆర్వో మోహన్‌కుమార్, సీఈఓ రవికుమార్‌నాయుడు, సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు
‘‘మా మండలాల్లో అనేక సమస్యలు నెలకొన్నాయి. పలు అభివృద్ధి పనులు సగంలోనే ఆగిపోయాయి. ముఖ్యంగా గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు పెండింగులో ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్ సర్వీసులు మంజూరుకావడం లేదు. యూరియా కొరత తీవ్రంగా ఉంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పీహెచ్‌సీల్లో పేదలకు సరైన వైద్య సేవలు అందడం లేదు. ఈ విషయాలను గత జెడ్పీ సమావేశంలో చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇలాంటి సమావేశాలు ఎందుకు’’ అని పలువురు ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చప్పగా సాగిన
జెడ్పీ సమావేశం
ప్రోటోకాల్ పాటించరా
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గంలో ఏ అధికారి ప్రోటో కాల్ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్స వానికి సైతం తనను పిలవడం లేదని వాపోయా రు. ఎంపీడీవోలు నిబంధనలు పాటించడం లేదని, వరదయ్యపాళ్యం ఎంపీడీవోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వందలాది ఎకరాలకు పంట నష్ట పరిహారం ఎప్పుడిస్తారని అధికారులను నిలదీశారు. విద్యుత్ సబ్ స్టేషన్లలో షిఫ్టు ఆపరేటర్ల పోస్టులను రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. బేరాలు కుదరకపోవడంతో విద్యుత్ సబ్ స్టేషన్‌ను ప్రారంభించలేదని విమర్శించారు. టెండర్లు పిలవకుండానే రూ.20 లక్షల విలువైన చెరువు పనులను కాంట్రాక్టర్‌కు అప్పనంగా అప్పగించారని దుయ్యబట్టారు. సీఎం రిలీఫ్ ఫండ్‌తో సంబంధం లేకుండా ప్రకృతి వైపరీత్యాలతో చనిపోయిన వారికి జెడ్పీ నిధుల నుంచి పరిహారం ఇవ్వాలన్నారు.


