ఎన్నికలకు ముందుకెళ్లని ప్రభుత్వం ముగిసిన సర్పంచుల వదవీకాలం పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకం గత ఎన్నికల ముందు అమలుకాని వైనం
కాణిపాకం: హామీలు ఇచ్చి చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కింది. ఆ సర్కారు వచ్చి రెండేళ్లు గడుస్తున్నా అభివృద్ధి పసులు, పథకాల అమల్లోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఫలితంగా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకుంది. ఈనేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే ఘోర పరాభవం తప్పదని భావించి, ప్రత్యేక అధికారుల పాలనను తెరపైకి తెచ్చింది. ఈనెల 2వ తేదీతో పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ముగిసింది. దీంతో ప్రత్యేక అధికారుల పాలనకే ప్రభుత్వం మొగ్గుచూపింది. శుక్రవారం ప్రత్యేకాధికారులను నియమించింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీలకు అధికారుల నియామకం పూర్తయ్యింది. ప్రత్యేకాధికారులు సోమవారం నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు.
చిత్తూరు నియోజకవర్గంలో 44 పంచాయతీలు, పూతలపట్టు నియోజకవర్గంలో 152 పంచాయతీలున్నాయి. ఇందులో గత ఎన్నికల్లో 90 శాతానికి పైగా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే సర్పంచులు, వార్డు సభ్యులుగా విజయం సాధించారు. ఐదేళ్ల పాటు పాలనలో శభాష్ అనిపించుకున్నారు. వీరి పదవీకాలం ముగియడంతో జిల్లా వ్యాప్తంగా పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల జరిగే వరకూ పంచాయతీల పాలనా వ్యవహారాలు వీరు చూడనున్నారు. కలెక్టర్ నేతృత్వంలోనే పాలన సాగనుంది. తహసీల్దార్లు, ఎంపీడీఓ, ఎంఈఓ, వ్యవసాయ, ఇతరశాఖ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు.
కష్టాలు తప్పవా?
పంచాయతీల పాలక వర్గాల పదవీకాలం ముగియడంతో ప్రజలకు అందాల్సిన వివిధ సేవలు, అభివృద్ధి పనుల్లో జాప్యం చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రత్యేకాధికారులు తమ సొంత శాఖకు సంబంధించిన విధులు నిర్వర్తించాల్సి వస్తుంది. ఆదనంగా పల్లె పాలనపై దృష్టి పెట్టాలంటే వారికి పని ఒత్తిడి పెరుగుతుంది. దీనికితోడు ఒక్కో అధికారికి రెండు నుంచి అధిక పంచాయతీలు అప్పగించారు. దీంతో వారిపై మరింత అదనపు భారం పడనుంది. ఈ పరిణామం ఇబ్బందిగా మారనుంది. గ్రామ పంచాయతీల్లో సమస్యలు ఎదురైతే ఇబ్బందులు తలెత్తనున్నాయి. అధికారులు వేరే ప్రాంతాల్లో ఉంటారు. వారిని సంప్రదించాలంటే ప్రజలకు వ్యవప్రయాసలు తప్పవు. ప్రస్తుతం ప్రత్యేకాధికారులు అన్ని సమయాల్లో అందుబాటులో ఉండే అవకాశం తక్కువ కావడం వల్ల ఆయా సమస్యల పరిష్కారంలో జాప్యం చోటు చేసుకుంటుందని ప్రజలు అంటున్నారు.
పంచాయతీ ఎన్నికలపై వెనక్కి..
పంచాయతీ ఎన్నికలకు చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు అవుతున్నా ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన అనేక పథకాలను పక్కన పెట్టేశారు. ఇసుక, మద్యం ద్వారా జేబులు నింపుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో అసంతప్తి సెగలు రేగుతున్నాయి. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే పరాభవం తప్పవనే భావనతో వెనక్కి తగ్గుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
నిధులు.. తప్పనితిప్పలు
పంచాయతీ పాలక వర్గాలు లేకుంటే పలు నిధులకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు చేపట్టకపోతే, కేంద్రం విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధులు రావు. ప్రస్తుతం స్థానిక నంస్థలు ప్రత్యేకాధికారుల పాలనలోకి వెళ్లడంతో ఆర్థిక సంఘం నిధులు విడుదలకు ఇబ్బంది వస్తుందని అంటున్నారు. పాలకవర్గాలు లేకపోవడంతో ఇవి విడుదలయ్యే అవకాశం లేదు. దీంతో మేజర్ పంచాయతీలు సాధారణ నిధులపై ఆధార పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎలాంటి ఆదాయవనరులు లేని చిన్న పంచాయతీలకు ఆర్థిక కష్టాలు తప్పవని సర్వత్రా ఆందోళన నెలకొంది.


